హుజుర్‌నగర్ ఓటర్లు పట్టించుకోలేదా?

24 Oct, 2019 15:40 IST|Sakshi

సాక్షి, హుజుర్‌నగర్‌: సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించింది. ఆర్టీసీ సమ్మె ప్రభావం పడలేదని ఫలితాన్ని బట్టి తెలుస్తోంది. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు 20 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు కార్మిక సంఘాలు ఉంచాయి. ఈ డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో కార్మికులు ఈనెల 5 నుంచి సమ్మె బాట పట్టారు. 6వ తేదీ సాయంత్రానికి విధుల్లో చేరని కార్మికులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ​ మొండి వైఖరిని ప్రతిపక్షాల సహా వివిధ సంఘాలు తప్పుబట్టాయి.

ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ వ్యవహారశైలి ప్రభావం హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికపై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. ఓటర్లు అధికార టీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెబుతారని ప్రతిపక్ష పార్టీలు భావించాయి. సొంత నియోజకవర్గాన్ని నిలబెట్టుకునేందుకు ఆర్టీసీ సమ్మె కలిసివస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ కూడా అనుకున్నారు. అయితే ఫలితం అందుకు భిన్నంగా వచ్చింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డిని భారీ మెజార్టీతో హుజుర్‌నగర్‌ ప్రజలు గెలిపించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల పోరాట కార్యచరణ ఎలా ఉండబోతుందో చూడాలి. ఆర్టీసీ సమ్మెపై మున్ముందు ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. తాజా ఓటమి నుంచి కాంగ్రెస్‌ ఎలాంటి గుణపాఠాలు నేర్చకుంటుందో చూడాలి. (చదవండి: మాది న్యాయ పోరాటం!)

>
మరిన్ని వార్తలు