హుజూర్‌నగర్‌లో ఎవరి బలమెంత..!

20 Oct, 2019 18:52 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట : హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఎన్నికల అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఏకైక ఉపఎన్నిక కావడంతో అందరి దృష్టి హుజూర్‌నగర్‌పై నెలకొంది. అయితే, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా గెలుపెవరిదని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సోమవారం (అక్టోబర్‌ 21) రోజున పోలింగ్ జరుగనుంది.  24న ఫలితాలు వెలువడుతాయి.

హుజూర్‌నగర్‌ ముఖచిత్రం
నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలు రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. మేళ్లచెరువు, చింతలపాలెం, హుజూర్నగర్, గరిడేపల్లి, మఠంపల్లి, నేరేడుచర్ల, పాలకీడు మండలాలతో పాటు  హుజూర్‌నగర్‌,
నేరేడుచర్ల మున్సిపాలిటీలుగా కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 3,21,142 మంది జనాభా ఉండగా 2,36,842 మంది ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య 1,20,427 మంది కాగా పురుష ఓటర్ల సంఖ్య 1,16,415 మందిగా ఉన్నారు. ఇక్కడ మహిళా ఓటర్లదే ఆధిక్యం. ఇక్కడ పురుషులకంటే మహిళా ఓటర్లు 4012 మంది ఎక్కువగా ఉన్నారు.  

2009, 2014, 2018 వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ నుండి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి  టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి  సైదిరెడ్డి పై 7466 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉత్తంకుమార్ రెడ్డి కి 92,996 ఓట్లు రాగా టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కి 85,530, సీపీఎం కు 2121, బీజేపీ కి 1555, స్వతంత్ర టక్కు గుర్తు అభ్యర్థికి 4944 ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్ శాతం 85.96గా నమోదు కాగా కాంగ్రెస్ కు 48%, టీఆర్ఎస్ 43.56 %,  సీపీఎం 1%, బీజేపీకి 0.83% ఓట్లు వచ్చాయి.

అనంతరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి ఉత్తమ్ ఎంపీగా గెలుపొంది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. నియోజవర్గంలో ఎస్టీ ఓటర్ల సంఖ్య అత్యధికంగా 29వేలు ఉండగా తర్వాత స్థానంలో రెడ్లు 27వేల మంది ఉన్నారు. ఎస్సీలు 21 వేలు, మాల 16వేలు, మున్నూరు కాపు 14వేలు, యాదవులు 16వేలు, గౌడ్లు 16వేలు, ముదిరాజ్ లు 13వేలు, పెరిక 7000, వైశ్యులు 8వేలు, కమ్మ 6వేలు, వెలమలు 2000, బ్రాహ్మణులు, రజకులు, నాయి బ్రాహ్మణ కమ్మరి, కుమ్మరి మంగలి అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు ఇక్కడ ఉన్నారు.

ప్రధాన పోటీ కాంగ్రెస్‌-టీఆర్‌ఎస్‌ మధ్యే..
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో 76 మంది నామినేషన్లు వేయగా చివరికి 28 మంది అభ్యర్థులు మిగిలారు. ఉప ఎన్నికల్లో అత్యధికంగా 45మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. తమ అభ్యర్థి  శేఖర్ రావు నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో సీపీఎం స్వతంత్ర అభ్యర్థి సాంబశివ గౌడ్‌కు మద్దతు ప్రకటించింది. సీపీఐ తొలుత టీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ఇవ్వగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మద్దతు ఉపసంహరించుకుంది. పోటీలో కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్, టీడీపీ, సీపీఐతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నప్పటికీ కాంగ్రెస్-టిఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి బరిలో ఉన్నారు. హుజూర్‌నగరగ్‌ కాంగ్రెస్ కంచుకోటగా ఉండగా ఉత్తమ్‌ తన పట్టు కోల్పోకుండా ఉండేందుకు కృషి చేస్తున్నారు. 

హుజూర్‌నగర్‌లో అభ్యర్థుల బలాబలాలు:
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలాలు: పార్టీకి బలమైన క్యాడర్ ఉండటం, ఉత్తత్‌కుమార్‌ రెడ్డి గతంలో మంత్రిగా అనేక అభివృద్ధి పనులు చేపట్టడం.
బలహీనతలు: కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం.

టీఆర్ఎస్ పార్టీ నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన సైదిరెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటివరకు హుజూర్‌నగర్‌లో ఖాతా తెరవని టీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం
సర్వశక్తులు ఒడ్డుతోంది.
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బలాలు: అధికారంలో ఉండటం, అభ్యర్థి గతంలో ఓడిపోయాడనే సానుభూతి.
బలహీనత: అధికారంలో ఉన్న టీఆర్ఎస్ హుజూర్‌నగర్‌ను అభివృద్ధి చేయలేదనే అప్రతిష్ట.

బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌లో 1555 ఓట్లు సాధించగా, ఎంపీ ఎన్నికల్లో 3 వేల ఓట్ల సాధించింది. బీసీ మంత్రంతో ఉపఎన్నికలో బరిలో దిగిన బీజేపీ ఎన్ని ఓట్లు సాధిస్తుందనే అంశంపై సర్వత్రా
చర్చ జరుగుతోంది. ఈసారి 5 నుండి 10 వేల ఓట్లు సాధింస్తామని బీజేపీ అంచనాలు వేసుకుంది. టీడీపీకి బలమైన క్యాడర్ ఉండగా తన ఓట్లు సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తుంది. 5 నుంచి 10 వేల ఓట్లు సాధించే దిశగా ప్రయత్నం చేస్తుంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా