కరోనా హబ్‌గా హైదరాబాద్

29 Jun, 2020 04:30 IST|Sakshi

వైరస్‌ కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: డీకే అరుణ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకే హైదరాబాద్‌ కరోనా హబ్‌గా మారిందని మాజీ మంత్రి, బీజేపీనేత డీకే అరుణ తీవ్ర స్థాయిలో విమర్శిం చారు. సీఎం కేసీఆర్‌కు ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ మీద ఉన్న కోపం ఇప్పుడు తెలంగాణ ప్రజలకు శాపమైందని వ్యాఖ్యానించారు. ఆదివారం పార్టీ ఎంపీ సోయం బాపూరావుతో కలసి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్‌లో ఓనర్లు, క్లీనర్ల పంచాయితీ నడుస్తోందని, వైరస్‌ను అడ్డం పెట్టుకుని టీఆర్‌ఎస్‌ చేస్తున్న శవ రాజకీయాలతో తెలంగాణ ప్రజలు బలిపశువులు అవుతున్నారన్నారు.

ఈటల రాజేందర్‌కు వాస్తవాలు తెలిసినా, సీఎంను ప్రశ్నించలేక పదవిని కాపాడుకునే పనిలో బీజేపీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. జిల్లా వైద్యాధికారులు చెబుతున్న లెక్కలకు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెలువరి స్తున్న కరోనా కేసుల సంఖ్యకు పొంతన లేదన్నారు. కేంద్రం కేటాయించిన  నిధులు రూ.7,151 కోట్లు, సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు వచ్చిన విరాళాల నిధులు ఎక్కడెక్కడ ఎంత ఖర్చుపెట్టారో చెప్పే నిజాయితీ కేసీఆర్‌కు ఉందా అని  ప్రశ్నించారు. హరితహారం పేరుతో ఊ ర్లు తిరుగుతున్న సీఎంకు హైదరాబాద్‌లోని ఆస్పత్రులను సందర్శించే బాధ్యత లేదా అని నిలదీశారు.  కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోనికి తేవాలని, లేదంటే ఆయుష్మాన్‌ భారత్‌లో చేర్చాలని  కోరారు.

ప్రజలను గాలికొదిలేశారు: బాపూరావు 
కరోనా పరీక్షలు చేయకుండా హైదరాబాద్‌ ప్రజలను సీఎం కేసీఆర్‌ గాలికొదిలేశారని ఎంపీ సోయం బాపూరావు విమర్శించారు. ప్రజల జీవితాలతో సీఎం చెలగాటమాడుతున్నారని, బతుకుతామా లేదా అని ఆందోళన చెందుతున్నారన్నారు. హైదరాబాద్‌ విషయంలో గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని కోరుతామని, కేంద్ర బృందాన్ని కూడా కలుస్తామని చెప్పారు. 

Poll
Loading...
మరిన్ని వార్తలు