మంత్రులకు షాక్‌!

25 May, 2019 07:37 IST|Sakshi
లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసిన మంత్రులు తలసాని, మల్లారెడ్డి (ఫైల్‌)

లోక్‌సభ ఎన్నికల్లో చేదు ఫలితాలు  

ఓటమిపాలైన తలసాని కుమారుడు, మల్లారెడ్డి అల్లుడు  

స్థానిక బూత్‌లలోనూ దక్కని ఆధిక్యం   

కంటోన్మెంట్‌: లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఇద్దరు మంత్రులకు షాక్‌ ఇచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమారుడు సాయికిరణ్‌ యాదవ్‌ సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అదే విధంగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి మల్కాజిగిరి నుంచి బరిలో నిలచి కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆయా పార్లమెంట్‌ స్థానాల్లోని అసెంబ్లీ స్థానాల్లోనే మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే స్థానిక నియోజకవర్గంలోనే టీఆర్‌ఎస్‌ ఆధిక్యం కొనసాగించలేకపోయింది. ఆయా మంత్రులు ఓటేసిన బూత్‌లలోనూ టీఆర్‌ఎస్‌కు ఆధిక్యం దక్కకపోవడం గమనార్హం.  

మారేడ్‌పల్లి నెహ్రూనగర్‌లో నివాసముండే మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఆయన తనయుడు సాయికిరణ్‌ యాదవ్‌ల ఓట్లు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గంలోని కస్తూర్బా కాలేజీలోని పోలింగ్‌ బూత్‌ నెం.220లో ఉన్నాయి. ఈ బూత్‌లో బీజేపీకి 395, కాంగ్రెస్‌కు 153 ఓట్లు రాగా... టీఆర్‌ఎస్‌కు కేవలం 89 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీతో పోలిస్తే టీఆర్‌ఎస్‌ 306 ఓట్లు తక్కువ రావడం గమనార్హం.
∙మంత్రి మల్లారెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్న బోయిన్‌పల్లి సెయింట్‌ పీటర్స్‌ స్కూల్‌లోని పోలింగ్‌ బూత్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డికి 207 ఓట్లు రాగా... మంత్రి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డికి 179 ఓట్లు దక్కాయి. ఈ బూత్‌లో కాంగ్రెస్‌ కంటే టీఆర్‌ఎస్‌కు 28 తక్కువ ఓట్లు పడ్డాయి. బీజేపీ సైతం ఈ బూత్‌లో 169 దక్కించుకోవడం గమనార్హం. 

మరిన్ని వార్తలు