టీఎంసీకి టీమిండియా మాజీ కెప్టెన్ గుడ్‌బై

26 Feb, 2018 12:55 IST|Sakshi
బైచుంగ్ భూటియా (ఫైల్‌ ఫొటో)

కోల్‌కతా: ఫుట్‌బాల్ ప్లేయర్, టీమిండియా మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ నుంచి తప్పుకున్నారు. అధిష్టానంతో విబేధాలు, ఇతరత్రా కారణాలతో టీఎంసీకి రాజీనామా చేసిన ఆయన ఈ మేరకు ట్వీటర్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘ నేడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. టీఎంసీకి సంబంధించిన అన్ని అధికారిక హోదాల నుంచి తప్పుకుంటున్నాను. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీలోను కొనసాగడం లేదంటూ’  భూటియా ట్వీట్ చేశారు.

గతేడాది గోరక్‌లాండ్ ఉద్యమం విషయంలో టీఎంసీ అధిష్టానానికి, భూటియాకు మధ్య విబేధాలు తలెత్తాయి. టీఎంసీకి రాజీనామా చేసి సొంత రాష్ట్రం సిక్కింలోని ఏదైనా ప్రాంతీయ పార్టీలో చేరాలంటూ ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అన్ని పదవుల నుంచి వైదొలగుతున్నట్లు భూటియా ప్రకటించేశారు. గత కొంతకాలం నుంచి న్యూఢిల్లీలోని బైచుంగ్ భూటియా ఫుట్‌బాల్ స్కూళ్ల అభివృద్ధిపై ఆయన దృష్టిసారించారు.

ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ కెరీర్ కు భూటియా 2011లో రిటైర్మెంట్ ప్రకటించారు. రాజకీయాల్లోకి రావాలని భావించిన భూటియా మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో 2013లో చేరిన విషయం తెలిసిందే. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా డార్జిలింగ్ నుంచి పోటీ చేసిన భూటియా బీజేపీ నేత ఎస్ఎస్ అహ్లువాలియా చేతిలో 1.96 లక్షల ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. ఆపై 2016లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సిలిగురి నుంచి పోటీ చేయగా.. సీపీఐ(ఎం) అభ్యర్థి అశోక్ భట్టాచార్య చేతిలో ఓటమి చవిచూసిన సంగతి విదితమే.

 
 

>
మరిన్ని వార్తలు