ఇప్పుడు లేదు, భవిష్యత్తులో చెబుతా

25 Sep, 2017 16:52 IST|Sakshi

కొత్త పార్టీ ఏర్పాటుపై ములాయం సింగ్‌ వ్యాఖ్య

అఖిలేశ్‌ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నా

హామీలను అమలు చేయడంలో బీజేపీ విఫలం

లక్నో: కొత్త పార్టీ ఇప్పట్లో పెట్టే ఉద్దేశం లేదని సమాజ్‌వాదీ పార్టీ మాజీ అధ్యక్షుడు ములాయం సింగ్‌ యాదవ్‌ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘నేనిప్పుడు కొత్త పార్టీ పెట్టడం లేదు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రకటనలు చేస్తాన’ని చెప్పారు. అఖిలేశ్‌ యాదవ్‌కు తన ఆశీస్సులు ఉంటాయని, అయితే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నానని అన్నారు. ఆ నిర్ణయాలు ఏమిటనేది రాబోయే రోజుల్లో వెల్లడిస్తానని చెప్పారు.

కేంద్రం, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ విఫలమయ్యాయని ములాయం విమర్శించారు. ‘కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా హామీలు అమలు చేయలేదు. పెట్రోలు-డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటాయి. బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో బాలికలకు రక్షణ లేకుండాపోయింది. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయి. రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. యోగి పాలనలో అన్నదాతలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నార’ని ములాయం మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

కాగా, ములాయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారనగానే ఆయన కొత్త పార్టీ ప్రకటిస్తారని అంతకుముందు ప్రచారం జరిగింది. సొంత పార్టీలో చేదు అనుభవాలు ఎదురైన నేపథ్యంలో ‘పెద్దాయన’  వేరు కుంపటి పెడతారని వార్తలు వచ్చాయి. ములాయం తాజా ప్రకటనతో ఊహాగానాలకు తెరపడింది.

మరిన్ని వార్తలు