టీడీపీతో ఎలాంటి సంబంధం లేదు: ఎంపీ

27 Sep, 2017 15:53 IST|Sakshi

రాజమహేంద్రవరం: టీడీపీతో తనకు ఎలాంటి సంబంధం లేదని విశాఖపట్నం జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం గిరిజన ప్రజా ప్రతినిధులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రివిలేజ్‌ కమిటీ ముందు పెడతానని తెలిపారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశానికి హాజరుకాబోనని ఆమె స్పష్టం చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 20 మందితో ఏర్పాటు చేసిన గిరిజన సలహా మండలిలో కొత్తపల్లి గీతకు స్థానం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇదిలావుంటే.. గీత ఎస్టీ కాదని, అందువల్ల ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై  తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో విచారణ జరుగుతోంది. కొత్తపల్లి గీత ఎస్టీ కాదని.. అయినా కూడా 2014 ఎన్నికల్లో ఎస్టీగా అరకు నుంచి పోటీ చేసి గెలుపొందారని, అందువల్ల ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ గుమ్మడి సంధ్యారాణి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని కొట్టేయాలని కోరుతూ కొత్తపల్లి గీత ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని కొట్టేయాలంటూ గీత దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు ఈ ఏడాది జూన్‌లో కొట్టేసింది. 2014 ఎన్నికల్లో అరకు లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌ సీపీ నుంచి పోటీ చేసి ఆమె ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు