అంబేడ్కర్‌ ఓ ఐకాన్‌ మాత్రమే..!

18 Apr, 2018 18:04 IST|Sakshi
అంబేడ్కర్‌కు ప్రధాని మోదీ నివాళి (పాత ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ రాజకీయాల్లో నేడు డాక్టర్‌ అంబేడ్కర్‌ అత్యంత ప్రజాదరణ కలిగిన చారిత్రక పురుషుడు. ప్రతి పార్టీ ఎన్నికల సందర్భంగానో, జయంతి, వర్ధంతుల సందర్భంగానో ఆయన ఉపన్యాసాల గురించి, భావాల గురించి మాట్లాడుతుంది. ‘సమాజంలో ఓ వెనకబడిన వర్గం నుంచి వచ్చిన నేను ఈ రోజున ప్రధాన మంత్రి అయ్యానంటే అందుకు కారణం అంబేడ్కర్‌’ ఆయన జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఎక్కడ ఎన్నికలు సమీపించినా ఆయన అంబేడ్కర్‌ పేరును తలవకుండా ఉండలేరు. ఆయన దేశంలో డిజిటల్‌ లావాదేవీల కోసం ‘భీమ్‌’ యాప్‌ను తీసుకొచ్చారు. భీమ్‌ అంటే మనలో ఎక్కువ మందికి దళితుల నినాదం ‘జైభీమ్‌’లోని అంబేడ్కర్‌ మనకు స్ఫురించరు. మహాభారతంలోని భీముడు మనకు స్ఫురిస్తారు. అది వేరే విషయం అనుకోండి!

1980వ దశకం వరకు కాంగ్రెస్‌ పార్టీ సహా ప్రధాన స్రవంతిలోని ఏ రాజకీయ పార్టీ అంబేడ్కర్‌ పేరును తలవలేదు. ఎన్నికల సందర్భంగా కూడా ప్రస్తావించలేదు. బీజేపీ మొదటి నుంచి ఆయనకు మరీ దూరంగా ఉంటూ వచ్చింది. పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు మాత్రం జయంతి, వర్ధంతులకు పూలదండలు వేసి మొక్కుబడికి నివాళులర్పించేవారు. 1990 దశకం వరకు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అంబేడ్కర్‌ను పట్టించుకోలేదని మేధావి, విద్యావంతుడు కంచ ఐలయ్య పేర్కొన్నారు. 1978లో ‘ఆల్‌ ఇండియా బ్యాక్‌వర్డ్‌ అండ్‌ మైనారిటీస్‌ కమ్యూనిటీస్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌’ ఏర్పాటుతో మరోసారి అంబేడ్కర్‌ ప్రజల దృష్టికి వచ్చారు. ఈ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసిన వ్యవస్థాప నాయకుల్లో ఒకరైన కాన్షీరామ్‌ 1984లో బహుజన్‌ సమాజ్‌ పార్టీని ఏర్పాటు చేయడంతో అంబేడ్కర్‌ పేరు మరింత ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత కాన్షీరామ్‌ శిష్యురాలు మాయావతి హయాంలో అంబేడ్కర్‌ పేరు మారుమోగిపోయింది. దళితుల ఓట్ల కోసం కొన్ని రాజకీయ పార్టీలు అంబేడ్కర్‌ను ఎత్తుకోవడంతో ఆయన దళితులకు ఓ ఐకాన్‌గా మారిపోయారు.

ఈ నేపథ్యంలోనే మండల్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేసిన వీపీ సింగ్‌ ప్రభుత్వం 1990లో అంబేడ్కర్‌కు దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’ను ప్రకటించింది. జాతిపిత మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూలకు అంబేడ్కర్‌ అంటే అసలు పడేది కాదు కనుక స్వాతంత్య్ర రాజకీయాల్లో ఆయన వివాదాస్పద నాయకుడిగానే చెలామణి అయ్యారు. గాంధీజీని తాను కనీసం వ్యక్తిగత నైతిక ప్రమాణాల ప్రాతిపదికగా కూడా మహాత్ముడిగా గుర్తించనని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబేడ్కర్‌ వ్యాఖ్యానించడం పట్ల నాడు గాంధీతోపాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు నొచ్చుకున్నారు. బ్రిటీష్‌ ఇండియాలో ఎన్నికలు రెండు రకాలుగా ఉండాలని, దళితులకు ప్రత్యేక ఓటింగ్‌ విధానం ఉండాలని, వారు దళితులను మాత్రమే తమ ప్రతినిధులుగా ఎన్నుకుంటారంటూ అంబేడ్కర్‌ ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. దాన్ని విరమించుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని గాంధీజీ బెదిరించడంతో ఆ ప్రతిపాదనను ఆయన ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.

1956లో అంబేడ్కర్‌ మరణించినప్పుడు జవహరలాల్‌ నెహ్రూ తన సంతాప సందేశంలో ‘వెరీ కాంట్రవర్శియల్‌ ఫిగర్‌ ఇన్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌ (భారత రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద నాయకుడు)’ అని వ్యాఖ్యానించారు. ఇక ఆయన ఆత్మకథను రాసిన ధనుంజయ్‌ కీర్‌ ‘మోస్ట్‌ హేటెడ్‌ మేన్‌ ఇన్‌ ఇండియా (భారత్‌లో ఎంతో వ్యతిరేకత కలిగిన నాయకుడు)’గా వర్ణించారు. కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలతో విసిగిపోయిన అంబేడ్కర్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ ఫెడరేషన్, ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీలను ఏర్పాటు చేసినా ఆయనకు ఓట్లు రాలలేదు. నేడు దళితుల ఓట్ల కోసం మాత్రం ప్రతి పార్టీ ఆయన పేరును నమ్ముకుంటోంది. అయినప్పటికీ అంబేడ్కర్‌కుగానీ, ఆయన రచనలకుగానీ నిజమైన గుర్తింపు రావడం లేదు. ఆయన్ని ఓట్లు కురిపించే ఓ ‘ఐకాన్‌’గానే చూస్తున్నారు.

మరిన్ని వార్తలు