తీవ్ర భావోద్వేగానికి లోనైన సోనియాగాంధీ!

16 Dec, 2017 12:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా తన తనయుడు రాహుల్‌ గాంధీ పగ్గాలు చేపట్టిన సందర్భంగా సోనియాగాంధీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆమె గద్గద స్వరం ప్రసంగిస్తూ పార్టీ అధ్యక్షురాలిగా తన ప్రస్తానాన్ని గుర్తుచేసుకున్నారు. అత్తమ్మ ఇందిరాగాంధీ, భర్త రాజీవ్‌ గాంధీ హత్యోదంతాలు తన జీవితాన్ని పూర్తి మార్చివేశాయని అన్నారు. రాహుల్‌ తన కొడుకు అని, అతన్ని ప్రశంసించడం భావ్యం కాదని అంటూనే.. అతడు శక్తిమంతుడని చెప్పారు. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. దేశంలో భయానక వాతావరణం నెలకొందని, రాజ్యాంగ విలువలపై దాడి జరుగుతున్నదని పేర్కొన్నారు. కొన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయినంతమాత్రాన ఎవరికీ తలవంచబోదని, ఎప్పటికీ వెనుకడుగు వేయదని ఆమె స్పష్టం చేశారు. సోనియాగాంధీ ఏమన్నారో.. ఆమె మాటల్లోనే..

  • రాహుల్‌ నా కొడుకు. అతన్ని నేను ప్రశంసించడం భావ్యం కాదు. కానీ అతను చిన్నతనంలోనే హింస ప్రభావాన్ని ఎదుర్కొని నిలబడ్డాడు. రాజకీయాల్లోకి వచ్చాక ఎంతో నిర్దాక్షిణ్యమైన వ్యక్తిగత విమర్శలను ఎదుర్కొన్నాడు. అవి అతన్ని శక్తిమంతుడ్ని చేశాయి
     
  • మన దేశ మౌలిక పునాదిపై, మన సంప్రదాయిక విలువలపై దాడి జరుగుతోంది. దేశంలో భయానక వాతావరణం నెలకొంది
     
  • మేం భయపడేవాళ్లం కాదు. మేం తలవంచేవాళ్లం కాదు. ఈ దేశ శ్రేయస్సు కోసమే మా సంఘర్షణ. ఈ విషయంలో మేం ఎప్పటికీ వెనుకడుగు వెయ్యం.
     
  • 2014 నుంచి మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ఈ రోజు మనం ఎదుర్కొంటున్న సవాలు అతి పెద్దది. మన రాజ్యాంగ విలువలపై దాడి జరుగుతోంది. మన పార్టీ చాలా ఎన్నికల్లో ఓడిపోయింది. అయినా ఎప్పటికీ మన పార్టీ ఎవరిముందు తలవంచబోదు
     
  • ఇందిరా వెళ్లిపోయిన కొన్నాళ్లకు రాజీవ్‌జీ కూడా మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. నా అండదండ సర్వం కోల్పోయిన భావన కలిగింది. ఆ పరిస్థితులను తట్టుకొని నిలబడటానికి కొంత సమయం పట్టింది.
     
  • నన్ను కన్నకూతురిలా ఇందిరాజీ దగ్గరికి తీసుకున్నారు. భారతీయ సంస్కృతి గురించి, విలువల గురించి నాకు నేర్పించారు
     
  • 1984లో ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు.. నేను నా తల్లిని కోల్పోయిన భావన కలిగింది. ఆ ఘటన నా జీవితాన్నే మార్చేసింది.
     
  • కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రాహుల్‌కు నా అభినందనలు, ఆశీస్సులు..!

తీవ్ర భావోద్వేగానికి లోనైన సోనియాగాంధీ 

Poll
Loading...
మరిన్ని వార్తలు