మా పార్టీ వైఖరిపై నిరాశ చెందా : పీకే

10 Dec, 2019 10:28 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుకు తమ పార్టీ జనతాదళ్‌(యు) మద్దతు తెలపడంపై ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ స్పందించారు. ఈ బిల్లును మొదట్లో వ్యతిరేకించిన జనతాదళ్‌, బిల్లు ప్రవేశపెట్టే ముందు రోజు (ఆదివారం) మద్దతివ్వాలని నిర్ణయించింది. ఈ పరిణామం​ పట్ల ప్రశాంత్‌ కిషోర్‌ స్పందిస్తూ.. ఇది తనకు నిరాశకు గురిచేసిందని వ్యాఖ్యానించారు. మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించే ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని సోమవారం ట్విటర్‌లో పేర్కొన్నారు. మరోవైపు బిల్లుకు జనతాదళ్‌ పార్టీ మద్దతు తెలపడంపై బీహార్‌లో ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ విమర్శించింది. నితీష్‌కుమార్‌ ప్రధాని మోదీకి బానిసలా వ్యవహరిస్తున్నారని, 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌, ఎన్నార్సీలకు మద్దతు తెలపడంతో ఈ విషయం రూడీ అయిందని వాగ్బాణాలు సంధించింది.

>
మరిన్ని వార్తలు