బాధలేదు.. ఇప్పుడు నా కొడుకున్నాడు : లాలూ

23 Dec, 2017 08:45 IST|Sakshi

సాక్షి, రాంచీ : దాణా కుంభకోణం కేసులో శనివారం తన భవితవ్యం తేలనున్న నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కాస్త మనోనిబ్బరంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఏం జరిగినా ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2013లో ఈ కేసుకు సంబంధించి తీర్పు వచ్చే సమయంలో తాను జైలుకు వెళితే తన పార్టీని ముందుకు నడిపించేది ఎవరు అని బాధపడ్డారు. అయితే, ఇప్పుడు మాత్రం ఆయనకు ఆ బాధ అస్సలు లేదు. 'పార్టీ గురించి నేనిప్పుడు బాధపడాల్సిందేమి లేదు.. అక్కడ తేజస్వీ ఉన్నాడు. అయినా మాకు అన్యాయం జరగదు. బీజేపీ కుట్రలను న్యాయం విడిచిపెట్టదు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. అదే సమయంలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా మేం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం' అంటూ ఆయన ఓ టీవీ చానెల్‌తో పంచుకున్నారు.

రాంచీలోని సీబీఐ కోర్టుకు మరికొద్ది గంటల్లో వెళ్లనుండగా ఆయన మీడియాతో మాట్లాడారు. నితీష్‌ కుమార్‌ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు తేజస్వీ యాదవ్‌ డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం తెలిసిందే. ఆ అనుభవంతోనే ఆర్జేడీని సమర్ధంగా నడిపిస్తారని లాలూ విశ్వసిస్తున్నారు. కాగా, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్‌ యాదవ్, జగన్నాథ్‌ మిశ్రా సహా 22 మందిపై నమోదైన దాణా కుంభకోణం కేసులో సీబీఐ కోర్టు శనివారం తీర్పు వెలువరించనున్న విషయం తెలిసిందే. విచారణకు హాజరయ్యేందుకు లాలూ తన కుమారుడు తేజస్వీతో కలిసి శుక్రవారం రాంచీకి చేరుకున్నారు. 1991-1994 కాలంలో దియోగఢ్‌(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.89 లక్షలకుపైగా అక్రమంగా డ్రా చేసినట్లు లాలూ సహా 38 మందిపై సీబీఐ 1997, అక్టోబర్‌ 27న చార్జిషీట్‌ దాఖలుచేసింది.  ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11 మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు.

>
మరిన్ని వార్తలు