టీడీపీలో మానసికంగా వేధించారు: బుట్టా రేణుక

16 Mar, 2019 20:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావడం మళ్లీ సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉందని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ఆమె శనివారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుట్టా రేణుక మీడియాతో మాట్లాడుతూ.. దూరం నుంచి చూస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయని, ఆ భ్రమలో తాను పెద్ద తప్పు చేశానన్నారు. అలాగే తాను కూడా టీడీపీలో అలాంటి అనుభవమే ఎదురైందన్నారు. చిన్న మిస్‌ అండర్‌స్టాండింగ్‌ వల్ల పార్టీ మారి పొరపాటు చేశానని, దానికి శిక్ష కూడా అనుభవించానని ఆమె అన్నారు. ఇప్పుడు వాస్తవాలను గ్రహించానని, తనకు ఎక్కడ గౌరవం ఉంది? ఎక్కడ మంచి స్థానం ఉందనే విషయం ఇప్పుడు తెలిసిందన్నారు.  ఒక మహిళగా, బీసీ నాయకురాలిగా తనకు వైఎస్సార్‌ సీపీలో మంచి గౌరవం దొరికేదన్నారు. చదవండి...(వైఎస్సార్‌ సీపీలోకి బుట్టా రేణుక, మాగుంట)

టీడీపీ విలువలు లేని పార్టీ
టీడీపీలో తనను మానసికంగా వేధించారని, టీడీపీ అధిష్టానం చెప్పే మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన లేదన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల సీట్లను కూడా అగ్ర కులాలకు ఇస్తున్నారని మండిపడ్డారు.  బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీలో బీసీ మహిళ అయిన తనను అవమానించారన్నారు. కర్నూలు బీసీ సిట్టింగ్‌ సీట్లు కూడా అగ్రకులాలకే ఇచ్చారని విమర్శించారు. టీడీపీ విలువలు లేని పార్టీ అని, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉందని బుట్టా రేణుక వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీలో ఉన్న పారదర్శకత, స్పష్టత టీడీపీలో లేవని, అవన్నీ మాటలకే పరిమితమన్నారు. తాను రాకీయాలకు కొత్త అయినా, రెండు పార్టీల్లో ఎంతో అనుభవం వచ్చిందన‍్నారు. ఏదో ఆశించి మాత్రం తాను ఇప్పుడు పార్టీలో చేరలేదని, రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపుకు తనవంతు కృషి చేస్తానని బుట్టా రేణుక అన్నారు.

మరిన్ని వార్తలు