లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తా: శరద్‌ పవార్‌

20 Feb, 2019 11:39 IST|Sakshi

సాక్షి, పూణే : లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై గత కొద్దిరోజులుగా నెలకొన్న సందిగ్ధతకు నేషనలిస్ట్ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌ తెరదించారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో పోటీకి దిగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని మాధా లోక్‌సభ నియోజక వర్గం నుంచి శరద్‌ పవార్‌ బరిలో దిగనున్నారు. ఆయన మంగళవారం సాయంత్రం ఇక్కడ మాట్లాడుతూ...’ వచ్చే ఎన్నికల్లో నేను పార్లమెంట్‌కు పోటీ చేస్తా. నా మేనల్లుడు అజిత్‌ పవార్‌, అలాగే కుటుంబ సభ్యులు పార్థ్‌ పవార్‌, రోహిత్‌ పవార్‌ కానీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయరు. కేవలం శరద్‌ పవార్‌ మాత్రమే పోటీ చేస్తారు’  అని కీలక వ్యాఖ్యలు చేశారు.

శరద్‌ పవార్‌ కుమార్తే సుప్రియా సూలె ఇప్పటికే బారామతి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆయన మేనల్లుడు అజిత్‌ పవార్‌ కుమారుడు రోహిత్‌ పవార్‌ వచ్చేఎన్నికల్లో పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో శరద్‌ పవార్‌ స్పష్టతనిచ్చారు. కాగా తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని శరద్‌ పవార్‌.. 2012లో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2014లో మాధా స్థానం నుంచి ఆ పార్టీ నేత విజయసింహా మోహిత్‌ పాటిల్‌ గెలుపొందారు.


 

మరిన్ని వార్తలు