రాజకీయాల నుంచి తప్పుకుంటా!

10 Jul, 2018 01:21 IST|Sakshi
ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ

ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ ప్రకటన

నియోజకవర్గంలో ఇమడలేకపోతున్నా.. 

మేయర్‌ మార్పు ప్రజలే కోరుతున్నారని వ్యాఖ్య

అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌.. ఏ పార్టీలో చేరనని స్పష్టీకరణ

సాక్షి, పెద్దపల్లి/జగిత్యాల: తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ఆర్టీసీ చైర్మన్, అధికార పార్టీకి చెందిన రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ప్రకటించారు. నియోజకవర్గంలో ఇమడలేక పోతున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నానని అన్నారు. సోమవారం గోదావరిఖనిలోని ఐదో గని గేటు మీటింగ్‌లో కార్మికుల సమావేశంలో, జగిత్యాల లో విలేకరులతో మాట్లాడారు. రామగుండం మేయర్‌పై అవిశ్వాసం ఆపేయాలని అధిష్టానం నుంచి ఫోన్‌ వచ్చిన 24 గంటల్లోపు సోమారపు ఈ నిర్ణయం తీసుకోవడం కలకలం సృష్టిస్తోంది.

‘‘15 ఏళ్లు రాజకీయంలో ఉన్నా.. అభివృద్ధికి ఎంతో కృషి చేశా.. కానీ నియోజకవర్గంలో మాత్రం ఇమడ లేకపోతున్నా’’అని సత్యనారాయణ అన్నారు. అధిష్టానం చెప్పిన విధంగా నడుచుకోవాలని, అదే ఫైనల్‌ కాబట్టి కొన్ని నిర్ణయాల్లో ఏం చేయలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో చాలా అభివృద్ధి పనులు చేశానన్నారు. మున్సిపల్‌లో తాను అడుగుపెట్టలేని స్థితి ఉందన్నారు. ఆర్టీసీ అధ్వాన స్థితిలో ఉందని, ఏదో చేయాలనుకున్నా స్థానిక పరిణామాలు మనోవేదనకు గురిచేశాయన్నారు. మేయర్‌ మార్పును ప్రజలే కోరుతున్నారని చెప్పారు. అవిశ్వాసం అనే పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దని మంత్రి కేటీఆర్‌ ఫోన్‌ చేసి చెప్పారని, కానీ కార్పొరేటర్లకు నచ్చజెప్పినా వినడం లేదన్నారు.

 తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా.. టీఆర్‌ఎస్‌కు, సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తన నియోజకవర్గంలో ఎవరు నిలబడినా గెలుస్తారని, వారికి అండగా ఉంటానని చెప్పారు. తాను రాజ కీయ సన్యాసం తీసుకున్నందున ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరుతానని సత్యనారాయణ అన్నారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ పదవులకు రాజీనామా చేస్తే అధిష్టానాన్ని ధిక్కరించినట్లవుతుందని, అందుకే రాజీనామా చేయనన్నారు. రాజకీయ సన్యాసమే తీసుకుంటే ఇక రాజీనామాలెందుకని ప్రశ్నించారు. కాగా, తాను ఏ పార్టీలోకి వెళ్లేది లేదని స్పష్టం చేశారు.  

అవిశ్వాసంపై తగ్గం: టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు  
కాగా మేయర్‌పై పెట్టిన అవిశ్వాసంపై వెనక్కి తగ్గేది లేదని టీఆర్‌ఎస్‌ కార్పోరేటర్లు స్పష్టం చేశారు. 50 మందికి గాను మేయర్, డిప్యూటి మేయర్‌లు పోనూ, 48 మంది కార్పొరేటర్లలో 41 మంది అవిశ్వాసానికి మద్దతునిస్తున్నారని పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ సత్యప్రసాద్‌ తదితరులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.  

మరిన్ని వార్తలు