ఎన్టీఆర్‌ను ఓడిస్తానని చంద్రబాబు అనలేదా? : పోసాని

11 Jun, 2018 16:39 IST|Sakshi
పోసాని కృష్ణమురళీ

సాక్షి, హైదరాబాద్‌ : నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్‌)కు వెన్నుపోటు పొడిచిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారని సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీ అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు సిగ్గు లేకుండా కొనుగోలు చేశారని మండిపడ్డారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు కాళ్లు పట్టుకుని విజయవాడకు పారిపోయారన్నారు.

 వైఎస్సార్‌ సీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే అని నారా లోకేశ్‌ అంటున్నారని, చంద్రబాబు బీజేపీతో దోస్తి కట్టలేదా? అని నిలదీశారు. తన రాజకీయ అవసరం కోసం ఎవరి కాళ్లు అయినా పట్టుకునే చంద్రబాబు ఎంత వగలాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అన్నారు. ఎన్టీఆర్‌కు విలువల్లేవని చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతిని పోసాని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించాలని కోరారు. లేకపోతే ఎన్టీఆర్‌కు నిజంగా విలువల్లేవనే భావన ప్రజల్లోకి వెళుతుందన్నారు.

దేశంలోని ఏ ముఖ్యమంత్రి తెచ్చుకోనన్ని స్టేలను చంద్రబాబు తెచ్చుకున్నారని చెప్పారు. వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్‌ చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు లేనిపోని ఆరోపణలను చేయడాన్ని పోసాని తీవ్రంగా ఖండించారు. వైఎస్‌ జగన్‌ను ఎదగకుండా అణగదొక్కేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని అన్నారు. జనసేన అధినేత పవన్‌ను అవసరానికి వాడుకున్న చంద్రబాబు, అవసరం తీరాక ఆయనపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. కమ్మ కులం పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

‘రాజకీయాలకు సీనియార్టీ అవసరం లేదు. వైఎస్‌ జగన్‌ ఏ విషయాన్నైనా స్పష్టంగా మాట్లాడతారు. ప్రజాసంకల్పయాత్రలో రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పండని వైఎస్‌ జగన్‌కు నేను సలహా ఇచ్చాను. కానీ, అందుకు ఆయన ఒప్పుకోలేదు. రుణమాఫీ కంటే మంచి ప్యాకేజీలను రైతులకు ఇస్తానన్నారు. రైతులను తాను మోసం చేయనని చెప్పారు. వైఎస్‌ జగన్‌లో స్పష్టత ఉంది. నా ఓటు ఆయనకే వేస్తానని ఓ ఓటర్‌గా చెబుతున్నాను. రాజకీయం కోసం చంద్రబాబు ఎవరితోనైనా దోస్తీ కడతారు. గతంలో మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌తో కలిశారు. ఆ తర్వాత ఆయన పార్టీకి విలువలు లేవన్నారు.

కమ్యూనిస్టులతో, పవన్‌తో కలిశారు. ఇప్పుడు వాళ్లపై విమర్శలు చేస్తున్నారు. అవసరం తీరిన తర్వాత వదిలేయడం చంద్రబాబుకు అలవాటే. ఎన్టీఆర్‌ను ఓడిస్తానని చంద్రబాబు అనలేదా?. ఓడిపోగానే గోడ దూకి టీడీపీలో చంద్రబాబు చేరారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ జెండాను కూడా చంద్రబాబు దొంగిలించారు. ప్రత్యేక హోదా వద్దన్నారు. ఇప్పుడేమో కావాలంటున్నారు. చంద్రబాబు రాజకీయాల్లో బ్రోకర్‌ పనులు చేస్తున్నారు. కేంద్రం పోలవరం కట్టిస్తానంటే చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు?’ అని పోసాని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు