ఈవీఎంలు రిగ్గింగ్‌ చేసినా నా గెలుపు ఖాయం..

9 Apr, 2019 20:14 IST|Sakshi

3 లక్షల మెజార్టీతో గెలుస్తా

చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 11న జరిగే ఎన్నికల్లో తాను 3లక్షల మెజార్టీతో గెలుస్తానని చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రశ్నించే నాయకుడు కావాలని చేవెళ్ల ప్రజలు కోరుతున్నారని, టీఆర్‌ఎస్‌ నేతలు ఈవీఎంలు రిగ్గింగ్‌ చేసినా తన గెలుపు ఖాయమని మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. పరిగిలో నిర్వహించిన సభతో తమ బలమేంటో కేసీఆర్‌కు తెలిసిందని, చేవెళ్లలో రెండో స్థానం కోసమే టీఆర్‌ఎస్, బీజేపీలు కొట్లాడుతున్నాయని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 400కి పైగా గ్రామాలు తిరిగానని, ఆరులక్షల మందిని కలిశానని, మూడు లక్షల హైఫైలు ఇచ్చానని, ప్రజల నుంచి అద్భుత స్పందన లభించిందని కొండా చెప్పారు. 

అభివృద్ధి కోసమే కొండా కాంగ్రెస్‌లోకి..
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి బాటలు వేసుకుందామని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తల్లి ప్రమోదిని అన్నారు. మంగళవారం యాలాల మండల కేంద్రంతో పాటు బెన్నూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికార టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి అభివృద్ధి కోసమే కొండా విశ్వేశ్వరరెడ్డి వచ్చారని గుర్తు చేశారు. సౌమ్యుడిగా, పేదల పక్షపాతిగా పేరున్న కొండాను ఎంపీగా గెలిపించుకుందామని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి పేదవాడు సుఖసంతోషాలతో ఉన్నారని, ప్రస్తుతం పింఛన్లు కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు. 


 

>
మరిన్ని వార్తలు