మమతా బెనర్జీకి అమిత్‌ షా సవాల్‌

13 May, 2019 14:52 IST|Sakshi

మమత దీదీ... జై శ్రీరాం అంటా దమ్ముంటే అరెస్ట్‌ చేయండి

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీకి  బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా సవాల్‌ విసిరారు. జై శ్రీరాం అని నినాదాలు చేస్తానని, తనను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సౌత్‌ 24 పరగణాల్లో అమిత్‌ షా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మమతా దీదీ... జై శ్రీరాం అంటూ నేనే కోల్‌కతాలోనే ఉంటా. మీకు ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్‌ చేయండి’  అని సవాల్ చేశారు. కాగా అమిత్‌ షా ర్యాలీతో పాటు హెలికాప‍్టర్‌ ల్యాండ్‌ అయ్యేందుకు మమతా సర్కార్‌ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.

జాద‌వ్‌పూర్‌లో రోడ్‌షో అనుమతి నిరాకరణపై అమిత్‌ షా మాట్లాడుతూ... ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నేను మూడు ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ  పోటీ చేస్తున్న జాద‌వ్‌పూర్‌లో  నియోజకవర్గంలో నేను ప్రచారం చేస్తే...ఎక్కడ తన మేనల్లుడు ఓడిపోతాడో అనే భయం మమతను వెంటాడుతోంది. అందుకే నా ర్యాలీకి అనుమతి రద్దు చేశారు.’ అని విమర్శించారు. మమతకు ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు.

కేంద్ర మంత్రి జవదేకర్‌ మాట్లాడుతూ... బెంగాల్‌ ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస‍్తున్న ప్రభుత్వ చర్యలపై ఈసీ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ముఖ్య నేతల ప్రచారానికి అడ్డుకుంటే ఇక ఎన్నికలకు అర్థమేముంటుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ బలపడుతోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ భయపడుతోందని జవదేకర్‌ అన్నారు. అందుకే అమిత్‌ షాతో పాటు బీజేపీ నేతల ప్రచారాన్ని మమతా సర్కార్‌ అడ్డుకుంటోందని ఆయన విమర్శించారు.

మరిన్ని వార్తలు