ఐఏఎస్‌ టాపర్‌ ‘పార్టీ’

20 Mar, 2019 07:37 IST|Sakshi

సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో ఇంకో రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. జమ్మూ కశ్మీర్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్‌ షా ఫైసల్‌.. ఉద్యోగం వదులుకుని మరీ ఈ పార్టీ పెట్టడం విశేషం. ‘జమ్మూ అండ్‌ కశ్మీర్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌’ పేరుతో ఏర్పాటైన ఈ రాజకీయ పార్టీలో జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (ఢిల్లీ) మాజీ విద్యార్థి నేత షెహలా రషీద్‌ చేరినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం శ్రీనగర్‌లో జరిగిన ఓ ర్యాలీలో షా ఫైసల్, షెహలా రషీద్‌ పాల్గొని పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించారు.

జమ్మూ కశ్మీర్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరితో విభేదించిన షా ఫైసల్‌ కొన్ని నెలల క్రితమే ఉద్యోగానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 2009 ఐఏఎస్‌ టాపర్‌గా నిలిచిన ఈయన ఆ తరువాతి కాలంలో చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించాయి కూడా. తాను సంప్రదాయ ప్రాంతీయ రాజకీయాలు చేసేందుకు పార్టీ పెట్టలేదని.. కశ్మీర్‌ సమస్యకు సామరస్య పూర్వక పరిష్కారం కనుక్కోవాలన్నది ఉద్దేశమని షా ఫైసల్‌ అంటున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని అన్ని వర్గాల వారికీ భాగస్వామ్యంతో పని చేస్తామని.. దశాబ్దాల క్రితం రాష్ట్రం వదిలి వెళ్లిన కశ్మీరీ పండితులు తిరిగి స్వస్థలాలకు చేరుకోవాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు