కాంగ్రెస్‌ నేతకు ఐఏఎస్‌ లీకులు?

27 Jun, 2018 00:51 IST|Sakshi

రాహుల్‌ సన్నిహిత నేతతో రెండుసార్లు కొందరు ఐఏఎస్‌ల భేటీ

ప్రాజెక్టుల టెండర్లు, మియాపూర్‌ భూస్కాం వివరాలు లీక్‌! 

తమ వర్గం అధికారులకు అప్రాధాన్య పోస్టులిస్తున్నారని మండిపాటు 

తమకన్నా జూనియర్లకు పోస్టులు ఇప్పిస్తున్నారని ఆగ్రహం 

భేటీపై కేంద్రం ఆరా.. ఇంటెలిజెన్స్‌ నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ

సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్‌: తమకు ప్రాధాన్యం కలిగిన పోస్టులివ్వడం లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న కొందరు ఐఏఎస్‌ అధికారులు ఇటీవల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సన్నిహితంగా ఉండే ఓ కాంగ్రెస్‌ నేతతో సమావేశం కావడం రాజకీయ, అధికార వర్గాల్లో సంచలనం రేపుతోంది! గడచిన రెండేళ్లుగా తెలంగాణలో తమ వర్గం ఐఏఎస్‌ అధికారులకు సరైన పోస్టులు దక్కకుండా ఓ ప్రభుత్వ సలహాదారు అడ్డుపడుతున్నారని వీరంతా ఆగ్రహంగా ఉన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకువెళ్లేందుకు వీరు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. ముఖ్యమంత్రిని కలవకుండా ఆ సలహాదారు అడ్డుకుంటున్నారని వీరు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యం లేకుండా పోతోందని భావించిన ఈ వర్గం ఐఏఎస్‌ అధికారులు తమకు సన్నిహితుడైన ఓ కాంగ్రెస్‌ నేతతో ఇటీవల సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో తమకు సరైన ప్రాధాన్యం లభించడం లేదన్నది వీరి సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం. రాహుల్‌కు సన్నిహితుడైన సదరు కాంగ్రెస్‌ నేత పనిలో పనిగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వీలుగా ఉండే సమాచారం ఏదైనా ఉంటే ఇవ్వాలని అడిగినట్లు తెలిసింది. దీంతో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఒకరిద్దరు కాంట్రాక్టర్లకు అనుకూలంగా రూపొందించిన నిబంధనలు, మియాపూర్‌ భూకుంభకోణానికి సంబంధించిన సమాచారాన్ని వీరు అందించినట్లు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఏయే అధికారుల పాత్ర ఉంది? వారు కాంగ్రెస్‌ నేతతో కలిసి ఏ విషయాలు చర్చించారన్న అంశంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. 

దృష్టి సారించిన కేంద్రం! 
కాంగ్రెస్‌ నేతతో సదరు ఐఏఎస్‌ అధికారులు రెండుసార్లు సమావేశమయ్యారని విశ్వసనీయ సమాచారం. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలని అధికారులు భావించారు. అయితే ఆ అధికారుల బృందంలోని ఓ సభ్యుడే ఆ సమావేశం వివరాలను మరో ఐఏఎస్‌ అధికారితో పంచుకోవడంతో ఇది కాస్తా బయటకు పొక్కింది. ఆ నోటా ఈ నోటా ఇది ఢిల్లీకి చేరడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. దీనిపై ఆరా తీయాలని ఇంటెలిజెన్స్‌ బ్యూరోను ఆదేశించినట్లు సమాచారం. ఐఏఎస్‌ అధికారులు వ్యక్తిగత పరిచయాల దృష్ట్యా ఎవరితో అయినా కలిసేందుకు అభ్యంతరం ఉండదని, అయితే ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని ప్రతిపక్ష నేతకు ఇవ్వడం దారుణమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాతే తెలంగాణ ప్రభుత్వం ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసినట్లు చెబుతున్నారు. మరికొందరికి కూడా ఏమాత్రం ప్రాధాన్యం లేని పోస్టులు కట్టబెట్టారని ప్రచారం జరుగుతోంది. 

ఆ సలహాదారు కుట్ర చేస్తున్నారని ఆరోపణలు 
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఒకరు ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన ఐఏఎస్‌ అధికారులకు ప్రాధాన్య పోస్టులు దక్కకుండా కుట్ర చేస్తున్నారన్నది ఆ వర్గానికి చెందిన సీనియర్‌ అధికారుల ఆరోపణ. గడచిన ఏడాదిన్నరగా ఈ అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన చెందుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలోనూ ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన ఐఏఎస్‌ అధికారులు ఉన్నా వారిని పట్టించుకోకుండా జూనియర్‌ అధికారులను జిల్లా కలెక్టర్లుగా నియమించారని వారు ఉదాహరణలతో సహా చెబుతున్నారు. కొత్త జిల్లాల నియామకాల్లో అగ్రవర్ణాల వారికే అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నది వారి ఆరోపణల్లో ప్రధానమైనది.

రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కూడా ఓ వర్గం వారికే ప్రాధాన్యం కలిగిన పోస్టులు లభిస్తున్నాయని, దీని వెనుక సదరు ప్రభుత్వ సలహాదారు ఉన్నారని ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన సీనియర్‌ అధికారులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను డమ్మీ చేసి తానే పాలనా యంత్రాంగంలో చక్రం తిప్పుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. సలహాదారు తీరును సీఎం దృష్టికి తీసుకెళ్లాలని వారు భావించారు. ‘‘మేం ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించాం. కానీ ఆ సలహాదారు మా ప్రయత్నాలను వమ్ము చేశారు. దీంతో చేసేది లేక మేం మిన్నకుండిపోయాం’’ అని ఓ అధికారి ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. 

పత్రాలు తీసుకువెళ్లారా? 
సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు కొందరు కాంగ్రెస్‌ నేతతో భేటీ కావడాన్ని ప్రభుత్వం ఎప్పుడో గమనించినట్లు ఉన్నతాధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే వారిని అప్రాధాన్య పోస్టుల్లో నియమించిందని ఆ వర్గాలు చెప్పాయి. అయితే ప్రభుత్వంలో కీలక సమాచారాన్ని ఆ కాంగ్రెస్‌ నేతకు ఇచ్చారా లేదా అన్న విషయంలో స్పష్టత లేదు. కావాలనే కొన్ని పత్రాలు బయటకు తీసుకువెళ్లారని ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండే ఓ సలహాదారు చెప్పారు. ఆ పత్రాలతో కాంగ్రెస్‌ నేతలు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు