రాప్తాడులో మంత్రి సునీతకు ఎదురుగాలి

2 Mar, 2019 12:05 IST|Sakshi
రాజీనామా పత్రం చూపుతున్న ఐడీసీ మాజీ చైర్మన్‌ నల్లపరెడ్డి

టీడీపీని వీడిన ఐడీసీ మాజీ చైర్మన్‌ నల్లపరెడ్డి   

ఆయన సోదరులు మాజీ ఎంపీపీ, మాజీ జెట్పీటీసీ కూడా..

త్వరలో జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్లు ప్రకటన

అనంతపురం: రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత ఎదురుగాలి వీస్తోంది. కుటుంబ పాలనతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న టీడీపీ నాయకులు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతుండడంతో మంత్రికి షాక్‌ మీద షాక్‌ తగులుతోంది. తాజాగా రాప్తాడు మండలం బుక్కచెర్లకు చెందిన ఐడీసీ మాజీ చైర్మన్‌ నల్లపరెడ్డి, ఆయన సోదరులు మాజీ ఎంపీపీ వీరారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సుబ్బారెడ్డి టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు.  2014 ఎన్నికల్లో వీరు మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. శుక్రవారం అనంతపురం నగరంలోని సూరజ్‌ గ్రాండ్‌ హోటల్‌లో నల్లపరెడ్డి సోదరులు ఏర్పాటు చేసిన  ‘ఆత్మీయ సభ’కు   అభిమానులు భారీగా తరలివచ్చారు. ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్‌ వెంకటరామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు గంగుల భానుమతి, మహానందరెడ్డి, జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రారెడ్డి, సాకే ఉమా, రిలాక్స్‌ నాగరాజు, మైనార్టీ నాయకులు  రిజ్వాన్, ఖాదర్‌బాషా, తొండమాల రవి, ఎద్దుల అమర్‌నాథ్‌రెడ్డి, గౌస్, ఇలియాజ్, భూలక్ష్మి, వన్నా హనుమంతరెడ్డి, కదిరప్ప  హాజరయ్యారు.

రాప్తాడులో కుటుంబ పాలన
ఈ సందర్భంగా నల్లపరెడ్డి మాట్లాడుతూ.. రాప్తాడు నియోజవకర్గంలోని అన్ని మండలాలకు మంత్రి సామాజిక వర్గానికి చెందిన వారినే ఇన్‌చార్జ్‌లుగా నియమించుకుని కుటుంబ పాలన సాగిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి మొదలుకుని నియోజకవర్గం వరకు ఒకే కులానిదే పెత్తనం సాగుతోందని విమర్శించారు. ఆ పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కనిపించడం లేదన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం దోపిడీ చేస్తోందన్నారు.‘నీరు–చెట్టు’ కార్యక్రమంలో ప్రతిరూపాయి వారి కుటుంబమే దోచుకుందని ఆరోపించారు.  కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, దీంతో చాలా మంది పార్టీకి దూరమవుతున్నారన్నారు. ఈసారి ఎన్నికల్లో భయపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తోందన్నారు. ఫ్యాక్షన్‌కు దూరంగా ఉంటామని చెప్పిన పరిటాల కుటుంబం ఈరోజు ఎక్కడ చూసినా గ్రామాల్లో చిచ్చు పెడుతోందన్నారు.  అనంతపురంలో ఎంపీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, మేయర్‌ స్వరూప మూడుముక్కలాట ఆడుతున్నారంటూ మండిపడ్డారు. త్వరలోనే వైఎస్‌ జగన్‌ను కలిసి వైఎస్సార్‌సీపీలో చేరుతామన్నారు. రాప్తాడు, అనంతపురంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు తమవంతు కృషి చేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు