ఇద్దరికీ సమానంగా ఓట్లు వస్తే..?

1 May, 2019 00:07 IST|Sakshi

ప్రజాస్వామ్యంలో మెజారిటీ అభిప్రాయమే శిరోధార్యం. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టయిన ఎన్నికల్లో కూడా ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే అతనే గెలిచినట్టు. లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఓటు ఆధిక్యతతో కూడా గెలిచిన వారున్నారు. అయితే, అభ్యర్థులిద్దరికి సమానంగా ఓట్లు వస్తే ఏం చెయ్యాలి. అలాంటి పరిస్థితుల్లో విజేతను నిర్ణయించటం ఎలా అన్న అనుమానాలు సహజమే. ఇలాంటి సమస్యలకు కూడా ప్రజా ప్రాతినిధ్య చట్టం పరిష్కారం చూపించింది. ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు సమానంగా వస్తే(బై) లాటరీ ద్వారా లేదా బొమ్మ బొరుసు పద్ధతి ద్వారా విజేతను నిర్ణయించాలని ఈ చట్టంలోని 102వ అధికరణ స్పష్టం చేస్తోంది. ఆ పద్ధతిలో వచ్చిన ఫలితాన్ని అభ్యర్థులు ఇద్దరు తప్పనిసరిగా ఆమోదించాలి.

లాటరీ తగిలిన అభ్యర్థికి అదనంగా ఒక ఓటు (లాటరీ) వచ్చినట్టు పరిగణించి అతనిని విజేతగా ప్రకటిస్తారు.గత ఏడాది అస్సాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆరు చోట్ల అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. దాంతో బొమ్మ బొరుసు వేసి విజేతల్ని ప్రకటించారు. అలాగే, 2017, డిసెంబరులో మధుర బృందావన్‌ మునిసిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మీరా అగర్వాల్‌ ఇలా లాటరీలో గెలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులిద్దరికీ 874 ఓట్లు రావడంతో లాటరీ తీశారు. 2017, ఫిబ్రవరిలో బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థి ఇలాగే లాటరీలో గెలిచి కార్పొరేటర్‌ అయ్యారు. ఇద్దరికి సమానంగా ఓట్లు వస్తే ఏం చెయ్యాలో ప్రజాప్రాతినిధ్య చట్టం చెప్పింది. మరి ముగ్గురికి సమానంగా ఓట్లు వస్తే ఏం చెయ్యాలో మాత్రం చట్టం చెప్పలేదు. ఇప్పటి వరకు అలాంటి స్థితి దేశంలో ఎప్పుడూ రాలేదు. 

మరిన్ని వార్తలు