బలం ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి

7 Nov, 2019 16:30 IST|Sakshi

ఉత్కంఠగా మారిన మహారాష్ట్ర రాజకీయాలు

గవర్నర్‌తో బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ

సాక్షి, ముంబై: ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో బీజేపీ-శివసేన మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సీఎం పీఠంపై పట్టు వీడేదిలేదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఇదివరకే ప్రకటించగా.. తాజాగా బీజేపీ ఎమ్మెల్యేలు మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీతో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరినట్లు సమాచారం. దీంతో ముంబై రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారాయి. ఈనెల 8న అసెంబ్లీ‍ గడువు ముగియనున్న నేపథ్యంలో.. గవర్నర్‌​ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ కీలక పరిణామాల నేపథ్యంలో గురువారం సంజయ్‌ రౌత్‌ మీడియాతో మాట్లాడారు. బీజేపీ-శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న వార్తలను ఖండించారు. బీజేపీకి సరైన సభ్యుల బలం ఉంటేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సవాలు విసిరారు. బీజేపీ ఎన్ని ఎత్తుగడలు వేసినా.. రాష్ట్రానికి తదుపరి సీఎం శివసేన నుంచే ఎన్నికవుతారని మరోసారి ధీమా వ్యక్తం చేశారు.

శివసేన నాయకుడు సీఎం అవ్వడానికి సరిపడ మద్దతు తమకు ఉందని రౌత్‌ మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాజ్యాంగం కేవలం బీజేపీ నేతల కోసం కాదని, ప్రజల హక్కుల కోసమని చురకలంటించారు. అలాగే బీజేపీ నుంచి చర్చల ప్రతిపాదన ఏదీ తమ ముందుకు రాలేదని అన్నారు. బీజేపీలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా వద్ద అన్న అంశంపై పార్టీ చీఫ్‌ ఉద్దవ్‌ ఠాక్రే తుది నిర్ణయం తీసుకుంటారని రౌత్‌ తెలిపారు. అలాగే బీజేపీతో తాడే పేడో చేల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. తమ పార్టీ సిద్ధాంతం ప్రకారమే నడుచుకుంటున్నామని, ధర్మానికి తాము కట్టుబడి ఉన్నామని రౌత్‌ అన్నారు. బీజేపీని చర్చలకు ఒప్పించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో తాము ఎలాంటి ప్రతిపాదనలు జరపలేదని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు