మేము కూడా ఒంటరిగానే పోటీ చేస్తాం : అఖిలేష్‌    

4 Jun, 2019 16:05 IST|Sakshi

ల​క్నో : రానున్న ఉప ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఒంటరిగా పోటీ చేస్తే.. తాము కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతామని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు.  రాబోయే ఉప ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని వెల్లడించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ - బీఎస్పీ కూటమి ఘోర విఫలమైన విషయం తెలిసిందే. అఖిలేష్ యాదవ్ ఆదేశాలను ఎస్పీ కేడర్ పాటించలేదని, ఆ పార్టీ నేతలు బీఎస్పీకి ఓట్లేయలేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. క్షేత్రస్థాయిలో బీఎస్పీ-ఎస్పీ పొత్తు పనిచేయలేదని, యాదవ సామాజికవర్గం ఓట్లు బీఎస్పీ అభ్యర్థులకు బదిలీ కాలేదని తెలిపారు.మాయవతి ఆరోపణలపై అఖిలేష్‌ స్పందిస్తూ.. మహా గఠ్‌ బంధన్‌ విడిపోతే రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. రాబోయే ఉప ఎన్నికల కోసం తాము సిద్ధమవుతున్నామని, 11 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో కూటమి ఓటమికి గల కారణాలను లోతుగా విశ్లేషణ చేస్తామన్నారు. సామాజిక న్యాయం కోసం బీఎస్‌పీతో కలిసి పోరాటం సాగిస్తామని ఎస్‌ చీఫ్‌ అఖిలేశ్‌యాదవ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు