ఆమె అంగీకరిస్తే.. పార్టీ అధ్యక్షురాలు అవుతారు!

4 Aug, 2019 20:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ రాజీనామా సమర్పించిన తర్వాత ప్రియాంక గాంధీ వాద్రా పార్టీ బాధ్యతలు చేపట్టాలన్న వాదనకు బలం చేకూరుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్‌ నేత కరణ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్షురాలిగా ప్రియాంక బాధ్యతలు చేపడితే బలమైన నాయకురాలవుతారని, పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం వస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ప్రియాంక సరైన అభ్యర్థియేనా అని అడిగిన ప్రశ్నకు ‘ప్రియాంక చాలా తెలివైన మహిళ. సోన్‌భద్ర వ్యవహారంలో బాధితులను కలవడానికి వెళ్లిన సమయంలో ఆమె వ్యవహరించిన తీరు అభినందనీయం. చాలా బాగా మాట్లాడింది. తను అంగీకరిస్తే కచ్చితంగా పార్టీ పగ్గాలు చేపడుతుంది’ అని బదులిచ్చారు.

పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ స్థానంలో యువ నేత అయితే బాగుంటుందని ఇటీవల పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు పీటీఐకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో కరణ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడి విషయంలో కాంగ్రెస్‌ పార్టీ మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలోని సీనియర్‌ నేతలంతా దీనిపై వీలైనంత త్వరగా ముందుకొచ్చి నిర్ణయం తీసుకోవాలన్నారు. కాగా, దీనిపై సీడబ్ల్యూసీ ఈనెల 10వ తేదీన సమావేశం కానున్నట్లు పార్టీ ఆదివారం ప్రకటించింది.

మరిన్ని వార్తలు