విజయం సాధించకపోతే.. సీఎం పదవికి రాజీనామా

17 May, 2019 08:34 IST|Sakshi

అన్ని స్థానాల్లో విజయం సాధిస్తాం

మెరుగైన ఫలితాలు రాకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తా

కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యం: అమరిందర్ సింగ్‌

చంఢీగడ్‌: లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తానని, పంజాబ్‌ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘పంజాబ్‌లో పార్టీ అత్యధిక స్థానాలు గెలిచే లక్ష్యంతో పని చేస్తున్నాం. పార్టీ అధిష్టానం మాపై ఆ బాధ్యత ఉంచింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రతి ఒక్కరు ఇదే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి చెందిన దానికి బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేస్తాను’’ అని అన్నారు.

రాష్ట్రంలోని మొత్తం 13 స్థానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం మూడు స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. బీజేపీ ఆరు, ఆప్‌ 4 స్థానాల్లో విజయం సాధించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘన విజయం సాధించి పెట్టిన అమరిందర్‌పైనే ఈసారి కూడా పార్టీ ఆశలు పెట్టుకుంది. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తామని కెప్టెన్‌ ధీమా వ్యక్తం చేశారు. చివరివిడత ఎన్నికల్లో భాగంగా మే 19న పంజాబ్‌లో పోలింగ్‌ జరగనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గాను 77 స్థానాల్లో విజయం సాధించి సీఎంగా అమరీందర్‌ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు