రాష్ట్రాల సహకారం లేనిదే అమలు కుదరదు : పీకే

20 Dec, 2019 15:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం ఏ చట్టం చేసినా రాష్ట్రాల సహకారం లేనిదే అమలు సాధ్యం కాదని ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌కిషోర్‌ మరోసారి తేల్చి చెప్పారు. శుక్రవారం ఓ ప్రముఖ జాతీయ మీడియాతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమలో ఆయన సీఏఏ, ఎన్నార్సీలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

ప్రశ్న : సీఏఏ, ఎ‍న్నార్సీలకు వ్యతిరేకంగా మీరు ట్వీట్‌ చేశారు. మీ పార్టీ ఏమో పార్లమెంటులో మద్దతిచ్చింది. దీనిపై మీరేమంటారు? 

జవాబు : పౌరసత్వ సవరణ బిల్లుపై పార్లమెంటులో ఓటింగ్‌ జరగక ముందే నా అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించాను. మా పార్టీ కూడా మొదట సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. కానీ తర్వాత వైఖరిని మార్చుకుంది. దీనిపై మా అధ్యక్షుడు నితీష్‌కుమార్‌ను అడిగాను. ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు అనిపించిందేంటంటే సీఏఏ, ఎన్నార్సీలను వారు వేర్వేరుగా చూస్తున్నారు. సీఏఏకు మద్దతిచ్చినా, ఎన్నార్సీకి మద్దతివ్వనని, అది బీహార్‌కు అవసరం లేదని ఆయన నాకు భరోసానిచ్చారు. సీఏఏ, ఎన్నార్సీలు దేశానికి మంచిది కాదని నా అభిప్రాయం. నాతో ఏకీభవించేవాళ్లంతా ఈ చట్టాలను వ్యతిరేకించాలని కోరుతున్నా.

ప్రశ్న : ఈ చట్టాలను బీజేపీయేతర ముఖ్యమంత్రులు వ్యతిరేకించాలని మీరు పిలుపునిచ్చారు. కానీ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తప్ప మిగతా ముఖ్యమంత్రులెవరూ ఇప్పటి వరకు స్పందించలేదు. వారంతా మీ సూచనను పాటిస్తారని అనుకుంటున్నారా? 
జవాబు : దేశంలోని  16 రాష్ట్రాల్లో బీజేపీయేతర ముఖ్యమంత్రులున్నారు. ఈ రాష్ట్రాల్లో దేశ జనాభా 65 శాతం ఉంది. గత లోక్‌సభ ఎన్నికలల్లో బీజేపీకి అత్యధిక మెజార్టీ స్థానాలు వచ్చినా ఓట్ల శాతం చూసుకుంటే వారికి వచ్చిన ఓట్లు 39 శాతమే. అంటే బీజేపీని దేశంలో 61శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారనేగా అర్థం. ఇప్పుడు బీజేపీ దేశ ప్రజలు మాకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు కాబట్టి, ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ 61 శాతం మంది మీకు వ్యతిరేకంగా ఓటు వేశారు కదా. వారి సంగతేంటి? ఈ 61 శాతం మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకే నేను వ్యతిరేకించమని చెప్పేది. 

ప్రశ్న : కానీ, కేంద్రం చేసిన చట్టాలను వ్యతిరేకించే అధికారం రాష్ట్రాలకు లేదు కదా? 
జవాబు : వ్యతిరేకించే అధికారం రాజ్యాంగం ప్రకారమైతే లేదు. కానీ రాష్ట్రాల సహకారం లేకుండా కేంద్రం ఈ చట్టాన్ని దేశంలో అమలు చేయగలదా? ఒక్క అస్సాంలోనే ఎన్నార్సీ చేపడితే రేయింబవళ్లు కష్టపడినా మూడేళ్లు పట్టింది. అలాంటిది దేశం మొత్తం అమలు చేయాలంటే ఎంతకాలం పడుతుంది. అది కూడా కేంద్రం మాత్రమే చేయాలంటే ఎంత సమయం పడుతుందో ఊహించండి. 

ప్రశ్న :  మరి పార్లమెంటులో మీ పార్టీ సీఏఏకు అనుకూలంగా ఓటు వేయడం ద్వంద వైఖరి కాదా? 
జవాబు : ఇది ద్వంద వైఖరి కాదు. పైన చెప్పినట్టు సీఏఏ, ఎన్నారర్సీలకు మధ్య లింకు ఉంటుందని వారు  బహుశా ఊహించి ఉండరని అనుకుంటున్నాను.

 ప్రశ్న : బీజేపీ నేతృత్వంలోని ఏన్డీయే కూటమిలో మీ పార్టీ జేడీయూ భాగస్వామి కదా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
జవాబు : మా పార్టీ ఎన్డీఏలో భాగస్వామియే. కాదనను. కానీ చరిత్ర చూస్తే కొన్ని కీలక సమస్యలపై ఈ రెండూ పార్టీల వైఖరి పరస్పరం విరుద్ధంగా ఉంటుంది. అలాగే ఎన్నార్సీపై కూడా మా పార్టీ వైఖరి ఏంటో ఇ‍ప్పటికే మా నాయకుడు స్పస్టం చేశారు.  

మరిన్ని వార్తలు