ఇంతై.. ఇంతింతై.. వటుడింతై

30 May, 2019 08:20 IST|Sakshi

వైఎస్‌ జగన్‌.. తెలుగు నాట ప్రస్తుతం మార్మోగుతున్న పేరు ఇది. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి యావత్‌ భారతదేశం దృష్టినీ ఒక్కసారిగా తన వైపునకు తిప్పుకున్నారు. ఉన్నత కుటుంబంలో పుట్టినా తొలి నుంచీ సామాన్యుడిగానే మెలిగిన ఈ 46 ఏళ్ల నవయువకుడు అనుకున్న లక్ష్యాన్ని సాధించి పట్టుదలకు మారుపేరుగా నిలిచారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుని ఎన్నికల పోరాటంలో మట్టికరిపించి విజేతగా నిలిచిన జగన్‌ పడినన్ని కష్టాలు రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే మరెవరూ పడి ఉండరు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేని ప్రత్యర్థులు అణగదొక్కాలని చూసిన ప్రతిసారీ నేలకు కొట్టిన బంతిలా పైకి లేచారు. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్సార్‌ మరణంతో తీవ్ర ఒడిదుడుకులు, కష్టాలను ఎదుర్కొన్నా..

‘ఇంతై.. ఇంతింతై.. వటుడింతై’ అన్నట్లుగా రోజు రోజుకూ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత బలీయమైన శక్తిగా అవతరించారు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయగా, ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇలా తండ్రీకొడుకులు తెలుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రజలకు ఎలాంటి వివక్షా లేని సుపరిపాలన అందించే దిశగా జగన్‌ తన ప్రస్థానం మొదలుపెట్టబోతున్నారు. ప్రజాసంక్షేమ పాలనను అందించి అనతి కాలంలోనే తండ్రిని మించిన తనయుడినని నిరూపించుకోవాలనే తపనతో అడుగులు వేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని సంచలనాలకు కేంద్ర బిందువు కానున్న వైఎస్‌ జగన్‌ జీవిత విశేషాలివి..     – సాక్షి, అమరావతి

మే 17, 2009
రాజకీయ అరంగేట్రంలోనే కాంగ్రెస్‌ తరఫున కడప లోక్‌సభా స్థానం నుంచి 1,78,846 ఓట్ల ఆధిక్యతతో ఘన విజయం సాధించారు. (అంతకు ముందే 2004 ఎన్నికల్లో క్రియాశీల రాజకీయాలు, కాంగ్రెస్‌ తరఫున తండ్రి వైఎస్‌కు చేదోడువాదోడుగా ప్రచారం)

ఆగస్టు 31, 2009  
ఫైనాన్స్‌ కమిటీలో సభ్యుడు

జూలై 13, 2011
కడప లోక్‌ సభ ఉప ఎన్నికలో 5,43,053 ఓట్ల రికార్డు స్థాయి మెజారిటీతో విజయదుందుభి. వైఎస్‌ విజయమ్మ 81,373 ఓట్ల మెజారిటీతో పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి ఘనవిజయం.

మే 16, 2014
పులివెందుల నుంచి 75,243 ఓట్ల భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపు

మే 23, 2019
పులివెందుల నియోజకవర్గం నుంచి 90,110 ఓట్ల ఆధిక్యతతో గెలుపు

ముఖ్య ఘట్టాలు
సెప్టెంబర్‌ 2, 2009 : ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్‌ ప్రమాదంలో కన్నుమూత
సెప్టెంబర్‌ 25, 2009 : తన తండ్రి వైఎస్సార్‌ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను త్వరలోనే కలుస్తానని ప్రకటించిన జగన్‌
డిసెంబర్‌ 15, 2009 : రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ లోక్‌సభలో ప్లకార్డు చేతబట్టి సమైక్యాంధ్రకు మద్దతు
ఏప్రిల్‌ 9, 2010 : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి తొలి విడత ఓదార్పు యాత్ర ప్రారంభం
జూన్‌ 7, 2010 :  తన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలతో కలిసి ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను ఓదార్చడానికి అనుమతినివ్వాలని కోరిన జగన్‌. తిరస్కరించిన సోనియా
జూలై 8, 2010 : కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశాలను ధిక్కరించి ఓదార్పు యాత్రను పునఃప్రారంభం
నవంబర్‌ 29, 2010 : తన తల్లి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ విజయమ్మతో కలిసి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన జగన్‌. తాను కడప ఎంపీ పదవికి తాను, పులివెందుల ఎమ్మెల్యే  పదవికి విజయమ్మ రాజీనామాలు
మార్చి 11, 2011 : తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సభలో పార్టీ పేరును వైఎస్సార్‌ కాంగ్రెస్‌గా ప్రకటించిన జగన్‌
మార్చి 12, 2011 : ఇడుపులపాయలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించిన జగన్‌
జూలై 8, 2011 : ఇడుపులపాయలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తొలి ప్లీనరీ సమావేశాలు
ఆగస్టు 10, 2011 : జగన్‌ ఆస్తులు, సాక్షి పెట్టుబడులపై సీబీఐతో విచారణకు ఆదేశించిన హైకోర్టు
ఆగస్టు 18, 2011 : జగన్‌ ఆస్తులు, సాక్షి కార్యాలయాలపై సీబీఐ దాడులు, అనేక చోట్ల సోదాలు
మార్చి 31, 2012 : జగన్‌ ఆస్తుల కేసులో సీబీఐ చార్జిషీట్‌
మే 8, 2012 : సాక్షి పత్రిక, సాక్షి టీవీల బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసిన సీబీఐ
మే 27, 2012 : ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు జగన్‌ను విచారించిన సీబీఐ అధికారులు రాత్రి 7.20 గంటల సమయంలో ఆయనను అరెస్టు చేశారు.
జూన్‌ 15, 2012 : ఉప ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ 15 అసెంబ్లీ, 1 లోక్‌సభ నియోజకవర్గంలో విజయం సాధించింది.
సెప్టెంబర్‌ 23, 2013 : జగన్‌కు షరతులతో కూడిన బెయిలు మంజూరు
సెప్టెంబర్‌ 24, 2013 : జైలు విడుదల
అక్టోబర్‌ 5, 2013 : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ లోటస్‌పాండ్‌లో తన నివాసం వద్ద ఆమరణ దీక్ష 
మే 16, 2014 : శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పరాజయం. కేవలం 1.67 శాతం ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన టీడీపీ
జూన్‌ 20, 2014 : శాసనసభలో ప్రతిపక్ష నేతగా జగన్‌ను గుర్తిస్తూ స్పీకర్‌ ప్రకటన
జనవరి 31, ఫిబ్రవరి 1, 2015 : హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిరసనగా తణుకులో రెండు రోజులపాటు జగన్‌ రైతు దీక్ష
జూన్‌ 3, 2015 : మంగళగిరిలో రెండు రోజులు జగన్‌ సమర దీక్ష. ఏడాది పాలనలో చంద్రబాబు మోసాలపై, హోదా సాధించనందుకు ప్రభుత్వ వైఖరిపై నిరసన
ఆగస్టు 10, 2015 : ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో ఒక రోజు ధర్నా చేసిన జగన్‌
ఏప్రిల్‌ 23, 26, 2016 :  ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబుపై రాష్ట్ర గవర్నర్, ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్‌కు ఫిర్యాదు.
మే 16, 2016 : కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ఏకపక్షంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ప్రతిఘటిస్తూ 16, 17, 18 తేదీల్లో కర్నూలులో జగన్‌ దీక్ష
జనవరి 26, 2017 : ప్రత్యేక హోదా కోరుతూ విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనడానికి విశాఖ వెళ్లిన జగన్‌ను చంద్రబాబు ఆదేశాల మేరకు విమానాశ్రయంలోనే అడ్డుకున్న పోలీసులు
మార్చి 1, 2017 : కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద ఘోర బస్సు ప్రమాదం. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన జగన్‌పై దురుసుగా ప్రవర్తించిన అప్పటి కలెక్టర్‌ అహ్మద్‌బాబు. జగన్‌పై అక్రమ కేసులు
మే 1, 2, 2017 : మద్దతు ధరలు కోరుతూ గుంటూరులో రెండు రోజులపాటు దీక్ష
జూలై 8, 2017 : గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపంలో రెండు రోజుల పాటు జరిగిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు రాష్ట్రవ్యాప్తంగా కాలినడకన పర్యటించి ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటానని ప్రకటించిన జగన్‌.
నవంబర్‌ 6, 2017 : ఇడుపులపాయ నుండి పాదయాత్ర ప్రారంభం
అక్టోబర్‌ 25, 2018 :  వైజాగ్‌ ఎయిర్‌పోర్టులో జగన్‌పై హత్యాయత్నం.
జనవరి 9, 2019 : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగింపు.
మే 23, 2019 : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అఖండ విజయం సొంతం.

మరిన్ని వార్తలు