నిరుద్యోగ ఆంధ్రాగా మార్చారు

18 Jun, 2018 12:19 IST|Sakshi
కంబాల జోగులు

సీఎం చంద్రబాబుపై  ధ్వజమెత్తిన రాజాం ఎమ్మెల్యే జోగులు

రాజాం : ఆంధ్రప్రదేశ్‌ని నిరుద్యోగ ఆంధ్రాగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. ఆదివారం రాజాంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చిరుద్యోగులంతా రోడ్డున పడ్డారని ఆరోపించారు. నాలుగేళ్ల పాలనలో సుమారు తొమ్మిది వేల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారని చెప్పారు.

ఈ పాపం టీడీపీ నేతలకు తగలకతప్పదన్నారు. జిల్లాలో 900 మంది ఆదర్శ రైతులు, 300 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు కోల్పోయారని గుర్తు చేశారు. పార్టీ వివక్ష చూపించి 238 మంది రేషన్‌ డిపో డీలర్లను తొలగించారని, వెలుగుశాఖలో చిరుద్యోగులుగా ఉన్న 390 మంది సీఎఫ్‌లను తొలగించారని పేర్కొన్నారు. 650 మంది సాక్షరాభారత్‌ కోఆర్డినేటర్లపై వేటు వేశారని తెలిపారు.

కేజీబీవీలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలల్లో వలంటీర్లు, స్వీపర్లు, నైట్‌ వాచ్‌మెన్లుగా పనిచేస్తున్న 280 మందిని తొలగించారని దుయ్యబట్టారు. ఇదే కోవలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు, గృహనిర్మాణశాఖలో ఔట్‌సోర్సింగ్‌ ద్వారా పనిచేసిన 230 మంది వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు,  600 మంది కంప్యూటర్‌ బోధకులు, పంచాయతీల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, వివిధ శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ ద్వారా విధులు నిర్వహిస్తున్న  1700 మంది ఉద్యోగులను తొలగించి అన్యాయం చేశారన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ వైపు కేంద్రాన్ని తిడుతూ మరో వైపు ప్రధానమంత్రితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే సత్తా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందన్నారు.  

మరిన్ని వార్తలు