అలుపెరగని విక్రమార్కుడు

15 Mar, 2019 11:02 IST|Sakshi
బొత్స రాములు నివాసం

 మూడు సార్లు ఎంపీగా.. అయిదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ

 ఇండిపెండెంట్‌ అభ్యర్థి బొత్స రాములు

 డిపాజిట్‌ గల్లంతైనా తరగని ఉత్సాహం 

సాహసం నా పథం.. రాజసం నా రథం.. సాగితే ఆపడం సాధ్యమా.. పౌరుషం ఆయుధం.. పోరులో జీవితం.. కైవసం కావటం కష్టమా.. తప్పని ఒప్పని తర్కమే చేయను.. కష్టమో నష్టమో లెక్కలే వేయను.. అన్నాడొక సినీ కవి. బొబ్బిలి గొల్లపల్లికి చెందిన చెందిన బొత్స రాములు ఈ కోవకే చెందుతారు. అనుకున్నది చేసేస్తారు. చేసేది తప్పా ఒప్పా పట్టించుకోరు. అందుకే.. ఏకంగా మూడు సార్లు ఎంపీగా.. అయిదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎప్పటికైనా ప్రజలు గుర్తించకపోతారా.. గెలిపించకపోతారా.. చట్ట సభల్లో అధ్యక్షా.. అంటూ గళం వినిపించకపోతానా.. అన్న ఆశ ఆయనలో ఇప్పటికీ సజీవంగా ఉంది. అనారోగ్యంతో ఇంటి పట్టునున్న బొత్స రాములు.. ఆరోగ్యం సహకరిస్తే ఈ ఎన్నికల్లో నిల్చునేవాడినని ఘంటాపథంగా చెబుతున్నారు.        

ఆరోగ్యం బావుంటేనా..
ఎమ్మెల్యేగా 1983, 1985, 1994, 1999, 2001లలో బొబ్బిలి నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయాను. వయసు 75ఏళ్లు దాటాయి కదా.. రాజకీయాలపై ఆసక్తి ఉంది. పోటీ చేయాలనుంది.. కానీ ఆరోగ్యం సహకరించడం లేదు. 

 


అనారోగ్యంతో బాధ పడుతున్న బొత్స రాములు 

ఎవరూ టికెట్‌ ఇవ్వలేదు
ఎన్నికల గురించి తెలుసుకుంటున్నాను. నామినేషన్ల తరువాత కేవలం 15రోజులే ఎన్నికలకు గడువుంది. నాకు ఎన్నికల్లో నిల్చోవడం సరదా. ప్రతిసారీ ఇండిపెండెంట్‌గానే పోటీ చేశాను. ఏ పార్టీ నాకు టికెట్‌ ఇవ్వలేదు కూడా. 

డిపాజిట్టే రాలేదు
అప్పట్లో నాయకుడిగా చిన్న చిన్న పనులు గ్రామంలో చేసేవాడిని. తెల్లబట్టలు వేసుకుని ఓటేయండని అడిగేవాడిని. నాకు పెద్దగా ఖర్చు అయ్యేది కాదు. ఇన్నిసార్లు పోటీ చేసినా ఒక్కసారీ డిపాజిట్లు రాలేదు.. ప్రజలు తిరస్కరించినా పోటీ చేయాలనే సరదాతో పోటీ చేశాను. పార్టీలపై ఆసక్తి లేదు. 

ఆ రోజులే వేరు
అప్పట్లో రాజకీయాలకు నైతిక విలువలు ఉండేవి. తరువాత ఎన్టీఆర్, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కొంత విలువ పెంచారు. కానీ ప్రస్తుత నాయకులు ప్రలోభపెడుతున్నారు. ఓటర్లు డబ్బు, మందుకు లొంగిపోయి అమ్ముకుంటున్నారు. నాకు భార్య పార్వతి, కుమారులు మన్మధ, తిరుపతి, గణపతి ఉన్నారు. భార్యకు 80 సెంట్ల భూమి ఉంది. దాంతో నేను, నా భార్య బతుకుతున్నాం. పిల్లలు ఎవరి జీవితాలు వాళ్లవి. ఆర్థికంగా తినడానికి సరిపోతుంది. 

సమర్థ నాయకత్వం రావాలి
రాష్ట్రానికి సరైన నాయకత్వం రావాలి. అప్పుడే ప్రగతి పథంలో నడుస్తుంది. యువత, మహిళలు ఓటు విలువ తెలుసుకోవాలి. పనిచేసేవారికి ఓటు వేయాలి. రాష్ట్రాభివృద్ధికి బాట వేసే సమర్థుడిని ఎన్నుకోవాలి.  

మరిన్ని వార్తలు