‘కశ్మీర్‌’పై యశ్వంత్‌ కీలక వ్యాఖ్యలు

2 Oct, 2017 11:36 IST|Sakshi

భావోద్వేగాల పరంగా భారత్‌కు కశ్మీరీలు దూరమయ్యారు

ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం బాధాకరం

న్యూఢిల్లీ: కశ్మీర్‌ అంశంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును బీజేపీ సీనియర్‌ నాయకుడు యశ్వంత్‌ సిన్హా తప్పుపట్టారు. లోయలోని ప్రజలు భారత్‌కు దూరమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ జర్నలిస్టు కరణ్‌ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యశ్వంత్‌ ఈ విషయాలు వెల్లడించారు. ముద్రా బ్యాంకు, జనధన్‌ యోజన వంటి కార్యక్రమాలు విజయవంతమైనట్లు ప్రభుత్వం చెబుతున్నదంతా ప్రచార ఆర్భాటమేనని అన్నారు. ‘జమ్మూ కశ్మీర్‌ ప్రజలను విస్మరించడం నన్ను బాధిస్తోంది. భావోద్వేగాల పరంగా వారిని మనం దూరం చేసుకున్నాం. వారు మనపై నమ్మకం కోల్పోయారని తెలుసుకోవాలంటే లోయలో పర్యటించాల’ని అన్నారు. కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి జరిపే చర్చల్లో ఏదో ఒక దశలో పాకిస్తాన్‌కు చోటు కల్పించడం తప్పకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

ప్రధాని నరేంద్రమోదీని తనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం బాధించిందని సిన్హా తెలిపారు. మోదీని కలిసేందుకు 10 నెలల క్రితమే తాను సమయాన్ని కోరినా ఇప్పటివరకు ఇవ్వలేదని వెల్లడించారు. అయితే ఈ నెల 14న మోదీ, సిన్హా ఒకే వేదికపై కనిపించనున్నారు. పట్నా యూనివర్సిటీ శతవార్షికోత్సవాలకు వీరిద్దరూ హాజరుకానున్నారు. పూర్వ విద్యార్థిగా సిన్హాను ఆహ్వానించినట్టు వీసీ రాస్‌ బిహారి సింగ్‌ తెలిపారు. పట్నా యూనివర్సిటీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో సిన్హా గ్రాడ్యుయేషన్‌ చేశారు.

మరిన్ని వార్తలు