వారి ఆవేదన ప్రభుత్వానికి పట్టదు!

29 May, 2020 05:17 IST|Sakshi

వలస కూలీల వెతలపై సోనియా గాంధీ వ్యాఖ్య  

న్యూఢిల్లీ: వలస కూలీల వెతలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మండిపడ్డారు. వలస కూలీల ఆర్తనాదాలు దేశంలోని అందరికీ వినిపిస్తున్నా.. ప్రభుత్వానికి మాత్రం వినిపించడం లేదని విమర్శించారు. లాక్‌డౌన్‌తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నవారికి తక్షణమే ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రతీ కుటుంబానికి రూ. 7500 చొప్పున రానున్న ఆరు నెలల పాటు అందించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ ‘స్పీక్‌ అప్‌ ఇండియా’ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది.

అందులో భాగంగా ఒక వీడియో సందేశాన్ని సోనియా పార్టీ సోషల్‌ మీడియా వేదికలపై గురువారం విడుదల చేశారు. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, అయినా, లాక్‌డౌన్‌తో జీవనోపాధి కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవడం లేదని సోనియా పేర్కొన్నారు. ‘స్వాతంత్య్రం తరువాత ఈ స్థాయిలో వేదనాభరిత పరిస్థితులు ఎన్నడూ ఎదురుకాలేదు. వేలాది మంది వలస కూలీలు, కార్మికులు, మహిళలు, చిన్నపిల్లలు స్వస్థలాలకు వందలాది కిలోమీటర్లు మండుటెండలో, వట్టి కాళ్లతో, ఆహారం, ఔషధాలు, రవాణా సదుపాయాలు లేకుండా నడిచి వెళ్తున్న విషాధ దృశ్యాలు కలచివేస్తున్నాయి. వారి బాధ, వారి వేదన అందరికీ అర్థమవుతోంది. ప్రభుత్వానికి తప్ప’ అని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు