కొత్తనీతి.. సరికొత్త రీతి

10 Mar, 2019 03:44 IST|Sakshi
గ్రేటర్‌ నోయిడాలో దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ఆర్కియాలజీ సంస్థలో విగ్రహం పక్కన మోదీ

ఉగ్రవాదులను ఇళ్లలో దూరి హతమార్చాం

ముంబై దాడికి ప్రతీకారంపై యూపీఏ మౌనం వహించింది

బలగాలు సిద్ధంగా ఉన్నప్పటికీ అనుమతించలేదు

విపక్షాలపై మోదీ నిప్పులు

నోయిడా: బాలాకోట్‌ ఉగ్రదాడిపై ఆధారాలు చూపాలంటున్న ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఉగ్రమూకల ఏరివేత విషయంలో యూపీఏ ప్రభుత్వం ధైర్యం, తెగువ చూపలేకపోయిందని విమర్శించారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం 2016లో సర్జికల్‌ స్ట్రైక్స్‌ ద్వారా ఉగ్రమూకలకు వారికి అర్థమయ్యే భాషలోనే గుణపాఠం చెప్పిందని వ్యాఖ్యానించారు. భారత్‌ ఇప్పుడు ‘కొత్తనీతి–సరికొత్త రీతి’తో ముందుకుపోతోందన్నారు.  ‘2008లో జరిగిన ముంబై మారణహోమాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదు. ఆ ఉగ్రదాడులకు భారత్‌ వెంటనే ప్రతిస్పందించి ఉంటే ప్రపంచం మొత్తం మనకు అండగా నిలిచేది. పాక్‌లో ఉగ్రసంస్థల పాత్రపై మనదగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. కానీ అప్పటి ప్రభుత్వం ధైర్యం, తెగువ చూపలేకపోయింది. ఉగ్రదుశ్చర్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి మన భద్రతాబలగాలు సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం మౌనం వహించింది’ అని అన్నారు.

తెల్లవారుజామునే పాకిస్తాన్‌ ఏడ్చింది..
పాక్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్రస్థావరంపై భారత వాయుసేన ఫిబ్రవరి 24న దాడిచేశాక తెల్లవారుజామున 5 గంటలకు ‘మోదీ మాపై దాడి చేశాడు’ అని పాక్‌ ఏడుపు అందుకుంది. దాడులతో ఇబ్బందిపెడుతూనే ఉండొచ్చనీ, ఇండియా ప్రతిస్పందించదని వాళ్లు భావిస్తున్నారు. 2014కు ముందున్న రిమోట్‌ కంట్రోల్‌ ప్రభుత్వం కారణంగానే శత్రువులకు ఈ అభిప్రాయం బలంగా ఏర్పడింది. ఉడీ ఘటన తర్వాత మన బలగాలు ఉగ్రవాదుల ఇళ్లలోకి దూరి వాళ్లను హతమార్చాయి. యూపీలోని కుర్జాలో, బిహార్‌లోని బుక్సారిన్‌లో రెండు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 50ఏళ్ల పాత సామగ్రిని వాడటంతో విద్యుత్‌ ఉత్పత్తి వ్యయం యూనిట్‌కు రూ.10కు చేరుకుందని ప్రధాని తెలిపారు. కానీ సౌరశక్తి ద్వారా ఇప్పుడు యూనిట్‌ విద్యుత్‌ను రూ.2కే ఉత్పత్తి చేయొచ్చన్నారు.

ఐదేళ్లలో మూడు దాడులు: రాజ్‌నాథ్‌
మంగళూరు: గత ఐదేళ్లలో భారత్‌ మూడు సార్లు దాడులు చేసిందని హోం మంత్రి రాజ్‌నాథ్‌  చెప్పారు. 2016లో ఉడి ఉగ్రవాద దాడి తర్వాత చేపట్టిన దాడి, ఇటీవల జరిపిన వైమానిక దాడుల గురించి వివరించిన రాజ్‌నాథ్‌ మూడో దాడి వివరాలు బయటపెట్టలేదు. శనివారం కర్ణాటక బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఉడిలో నిద్రపోతున్న సైనికులపై ఉగ్రవాదులు దాడి జరిపి 17 మందిని చంపివేశారని, దీనికి ప్రతీకారంగా పీవోకే భారత్‌ తొలి మెరుపుదాడి చేసిందన్నారు. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఆత్మాహుతి దాడి తర్వాత వైమానిక దాడి జరిపి జైషే ఉగ్ర శిబిరాన్ని నాశనం చేసిందన్నారు. ఈ దాడులతో భారత్‌ బలహీన దేశం కాదని పాకిస్తాన్‌కు గట్టి సందేశం ఇచ్చామని వెల్లడించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు