పారా ఆసియాలో పసిడి పంట

9 Oct, 2018 00:45 IST|Sakshi

3 స్వర్ణాలు సహా 12 పతకాలు కైవసం 

జావెలిన్‌ త్రోలో  సందీప్‌ ప్రపంచ రికార్డు 

జకార్తా: భారత దివ్యాంగ అథ్లెట్లు పారా ఆసియా గేమ్స్‌లో రెండో రోజు స్వర్ణాల బాట పట్టారు. సోమవారం జరిగిన పోటీల్లో 12 పతకాలు కొల్లగొట్టారు. ఇందులో మూడు స్వర్ణాలు, నాలుగు రజత, ఐదు కాంస్య పతకాలున్నాయి. ఓవరాల్‌గా భారత్‌ 17 పతకాలు సాధించింది. జావెలిన్‌ త్రోలో సందీప్‌ చౌదరి ప్రపంచ రికార్డుతో స్వర్ణం గెలుపొందగా, 1500 మీ. పరుగులో రక్షిత, స్విమ్మింగ్‌లో సుయశ్‌ జాదవ్‌ బంగారు పతకాలు గెలిచారు. పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌42–44/61–64 ఈవెంట్‌లో సందీప్‌ చౌదరి ఈటెను 60.01 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. దీంతో 1980లో మింగ్జీ గావ్‌ (59.82 మీ.; చైనా) నెలకొల్పిన రికార్డు కనుమరుగైంది.

మహిళల జావెలిన్‌ త్రోలో రమ్య షణ్ముగం రజతం, దీపా మాలిక్‌ కాంస్యం గెలిచారు. మహిళల 1500 మీ. పరుగులో రక్షిత స్వర్ణం, రాధ రజతం నెగ్గారు. పురుషుల 50మీ. బటర్‌ఫ్లయ్‌ ఎస్‌7 పోటీలో జాదవ్‌ స్వర్ణం చేజిక్కించుకున్నాడు. అతనికిది మూడో పతకం. తొలిరోజు రెండు కాంస్యాలు నెగ్గాడు. పురుషుల 100 మీ. ఫ్రీస్టయిల్‌ ఎస్‌ 10 ఈవెంట్‌లో స్వప్నిల్‌ సంజయ్‌... ఇదే విభాగం మహిళల పోటీలో సతీజా దేవాన్షి చెరో కాంస్యం గెలిచారు.  పవర్‌ లిఫ్టింగ్‌లో మహిళల 50 కేజీల కేటగిరీలో సకీనా కాటూన్‌ రజతం గెలుపొందగా, మిక్స్‌డ్‌ 50 మీ. ఫ్రీ పిస్టల్‌ ఈవెంట్‌లో షూటర్లు మనీశ్‌ నర్వాల్, సింగ్‌రాజ్‌ వరుసగా రజతం, కాంస్యం చేజిక్కించుకున్నారు. బ్యాడ్మింటన్‌ పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో యతిరాజ్, చిరాగ్, రాజ్‌ కుమార్, తరుణ్‌లతో కూడిన భారత బృందం కాంస్య పతకం సాధించింది.    

మరిన్ని వార్తలు