ముగ్గురి చేతుల్లో దేశం బానిస

12 Jun, 2018 02:20 IST|Sakshi

మోదీ, అమిత్‌షా, భాగవత్‌పై రాహుల్‌ మండిపాటు

ఆరు నెలల నుంచి ఏడాదిలో ప్రతిపక్షాల ఐక్యత

న్యూఢిల్లీ: బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ప్రధాని  మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌  భాగవత్‌ చేతుల్లో దేశం బానిసగా మారిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఆరు నెలల నుంచి ఏడాదిలోగా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాయని చెప్పారు. అతి త్వరలోనే దేశం శక్తిసామర్థ్యాలు ఏమిటో   మోదీ, అమిత్, భాగవత్‌ గ్రహించేలా చేస్తామన్నారు. ఢిల్లీలో తల్కాతోరా మైదానంలో కాంగ్రెస్‌ ఓబీసీ సెల్‌ ఏర్పాటు చేసిన ఓబీసీల సమావేశంలో రాహుల్‌ మాట్లాడారు.

వెనుకబడిన వర్గాల ప్రజల శక్తిసామర్థ్యాలను కాంగ్రెస్‌ గుర్తించిందని, వారికి అవకాశాలివ్వడం ద్వారా రాజకీయంగా వారు ఉన్నత పదవులు సాధించాలని కోరుకుంటోందని చెప్పారు. ఓబీసీలను శక్తివంతులుగా మారు స్తామన్నారు. తాము వారిని బస్సులో మాట్లాడకుండా కూర్చో బెట్టబోమని, వారికే తాళాలు ఇచ్చి డ్రైవింగ్‌ సీట్లో కూర్చోబెడతామని చెప్పారు. దేశంలో నైపుణ్యాలకు కొదవలేదని, వెనుకబడిన వర్గాల వారిలో నైపుణ్యాలు ఇంకా ఎక్కువ ఉంటాయని, అవకాశాలు ఇవ్వకపోవడం వల్లే వెనుకబడిపోయారన్నారు.

బీజేపీ 15–20 మంది పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేలా విధానాలను అనుసరిస్తోందని, ప్రధాని మోదీని మార్కెట్‌ చేసేందుకు వారు కోట్లు కుమ్మరిస్తున్నందుకు ప్రతిఫలంగా వారికి సహకరిస్తోందన్నారు. మోదీ విధానాలపై విమర్శలకు మరింత పదును పెట్టిన రాహుల్‌గాంధీ అమెరికా పారిశ్రామికవేత్తలకు కొత్త పేర్లు పెట్టారు. కోకా–కోలా వ్యవస్థాపకుడిని షికంజి విక్రేతగా, మెక్‌ డొనాల్డ్స్‌ను దాబావాలాగా, ఫోర్డ్, మెర్సిడెస్, హోండా వ్యవస్థాపకులను మెకానిక్స్‌గా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు