నాలుగు నెలలు... 68 దశలు

6 May, 2019 05:32 IST|Sakshi

మొదటి ఎన్నికల్లో  చిత్రాలు

2019 లోక్‌సభ ఎన్నికలు రెండు నెలల పాటు ఏడు దశల్లో జరుగుతున్నాయంటేనే ..అబ్బో..అంత టైమా...అనుకుంటున్నాం. అయితే, మన దేశంలో మొట్టమొదటి ఎన్నికలు ఏకంగా 68 దశల్లో నాలుగు నెలల పాటు జరిగాయి. 1951 అక్టోబరు నుంచి 1952,ఫిబ్రవరి వరకు ఆ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఎన్నికల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా 3000 సినిమా హాళ్లలో డాక్యుమెంటరీలు ప్రదర్శించారు. రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం ప్రతినిధులు కూడా ఇంటింటికీ తిరిగి ఓటు వేయమని ప్రజలకు చెప్పారు.

మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగే నాటికి దేశంలో 85శాతం ప్రజలు నిరక్షరాస్యులు. అప్పుడున్న 40కోట్ల జనాభాలో కేవలం 15శాతం మందికి మాత్రమే ఏదో ఒక భాషలో చదవడం, రాయడం వచ్చు. దాంతో ఓటర్లు రాజకీయ పార్టీల పేర్లను, అభ్యర్థ్ధుల పేర్లను చదవడం, గుర్తు పెట్టుకోవడం కష్టమని భావించిన ఎన్నికల కమిషనర్‌ సుకుమార్‌ సేన్‌ రాజకీయ పార్టీలకు గుర్తులు కేటాయించాలని నిర్ణయించారు. అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీకి నాగలి దున్నుతున్న జోడెద్దుల గుర్తు వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ చిహ్నమైన హస్తం మొదటి ఎన్నికల్లో ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌( నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌పార్టీ) పార్టీకి దక్కింది.

ఈ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారు చేయడానికి 16వేల మందికిపైగా సిబ్బంది ఆరు నెలల పాటు ఇల్లిల్లూ తిరిగారు. తీరా ఓటర్ల జాబితా తయారయ్యాక  పేరు లేని కారణంగా 28 లక్షల ఓటర్ల పేర్లను తొలగించాల్సి వచ్చింది. అప్పట్లో మహిళలు బయటివారికి తమ పేరు చెప్పేవారు కాదు. ఫలానా వారి భార్యననో, కూతురిననో, చెల్లెలిననో చెప్పడంతో సిబ్బంది అలాగే రాసుకోక తప్పలేదు. అలాంటి పేర్లను జాబితా నుంచి తొలగించారు.

ఆ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలు,అభ్యర్థులకు ప్రచారం ఎలా చేసుకోవాలో కూడా తెలిసేది కాదు. నెహ్రూ వంటి నేతలు బహిరంగ సభలు పెట్టి ఓట్లు అడిగేవారు.కొందరు ఇళ్లకు వెళ్లి అభ్యర్థించేవారు. బెంగాల్‌లో కాంగ్రెస్‌ పార్టీ రోడ్లమీద తిరిగే ఆవుల ఒంటిపై ‘కాంగ్రెస్‌కు ఓటెయ్యండి’అని రాసేవారు. ఆ ఆవుల్ని ప్రజలు ఆసక్తిగా ఉత్సుకతతో చూసేవారు. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన ప్రముఖుల్లో అంబేడ్కర్‌ ఒకరు. ఎస్‌సిలకు కేటాయించిన ఉత్తర మధ్య బొంబాయి నియోజకవర్గం నుంచి అంబేడ్కర్‌ పోటీ చేసి ఓడిపోయారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు