రాజధాని రంగస్థలం

24 Jan, 2020 04:29 IST|Sakshi

కేజ్రీ‘వాల్‌’ను కమలం బద్దలు కొట్టగలదా ?

సుపరిపాలనను నమ్ముకున్న ఆప్‌

మోదీ క్రేజ్‌తోనే బీజేపీ ముందుకు

బలమైన అభ్యర్థులపైనే కాంగ్రెస్‌ ఆశలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ రూటే వేరు. చదువుకున్న వారితోపాటు ఆస్తిపరులూ ఇక్కడే ఎక్కువ. తలసరి ఆదాయంలో గోవా తర్వాత స్థానం ఢిల్లీదే. అందుకే అభివృద్ధి కంటే ఇతర అంశాలే అసెంబ్లీ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్ని ఇండియా వర్సస్‌ పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన కపిల్‌ మిశ్రా చేసిన కామెంట్లు వివాదం రేపుతున్నా వన్డే క్రికెట్‌ మ్యాచ్‌కున్న ఉత్కంఠ రేగుతోంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే హిందూత్వ ఎజెండా, మోదీ క్రేజ్‌తోనే బీజేపీ ఎన్నికల గోదాలో దిగుతోంది. కుటుంబానికి పెద్ద కొడుకులా పనిచేస్తున్నానంటూ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తన సుపరిపాలననే నమ్ముకుంటూ ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేని కాంగ్రెస్‌ పార్టీ బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దింపి పూర్వ వైభవాన్ని సాధించాలన్న పట్టుదలతో ఉంది.  

కేజ్రీవాల్‌ పాలన ఆప్‌ని గట్టెక్కిస్తుందా ?  
అయిదేళ్లలో తన పనితీరు నచ్చితేనే మరోసారి ఓటు వేయండి అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఓటర్లకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇన్నాళ్లూ తాను చేసిన సుపరిపాలననే ఆయన నమ్ముకున్నారు. నెలకి 20 కిలో లీటర్ల కంటే తక్కువ వాడుకున్న వారికి ఉచితంగా నీరు, 32 శాతం వరకు తగ్గిన విద్యుత్‌ ధరలు, స్కూలు ఫీజుల్ని పెంచకపోవడం, ఆమ్‌ ఆద్మీ మొహల్లా క్లినిక్‌ (ఏఏఎంసీ)ల ద్వారా ఉచిత ఆరోగ్య పరీక్షలు వంటివి మళ్లీ గెలిపిస్తాయని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది.

గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు దక్కించుకోలేకపోయినప్పటికీ లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికల మధ్య వ్యత్యాసంపై ఓటర్లలో పెరగుతున్న అవగాహన తమకు కలిసి వస్తుందని భావిస్తోంది. ఆప్‌ అనుకున్నట్టుగానే లోక్‌సభ బీజేపీకి, శాసనసభ ఆప్‌కి అన్న పోస్టర్లు రాజధాని వీధుల్లో కనిపిస్తున్నాయి. ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలకు తావు లేకుండా కేజ్రీవాల్‌ హుందాగా ప్రచారం చేస్తున్నారు. కానీ బీజేపీ, కాంగ్రెస్‌తో పోలిస్తే అభ్యర్థుల బలం లేకపోవడం పార్టీకి మైనస్‌గా మారింది. ఎన్నికల్లో ఎక్కువగా కొత్త ము ఖాలకి టిక్కెట్లు ఇచ్చి కేజ్రీవాల్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  

మోదీ ఇమేజ్‌తోనే:  2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ వేవ్‌ ఢిల్లీలో బలంగా వీచింది. ఏడుకి ఏడు స్థానాలను రెండు సార్లు సాధించింది. కానీ, 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోదీకి ఉన్న క్రేజ్‌ పనిచేయలేదు. 2013లో హర్షవర్ధన్, 2015లో కిరణ్‌ బేడీని ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రకటించిన బీజేపీ ఈ సారి ఎన్నికల్ని మోదీ వర్సస్‌ కేజ్రీవాల్‌గానే చూస్తోంది. ఈ ఎన్నికల్లో కూడా జాతీయ స్థాయి అంశాలకే ప్రాధాన్యం ఇవ్వనుంది.  

కాంగ్రెస్‌ బలపడుతుందా ?
రాజధాని ఢిల్లీ అభివృద్ధి కాంగ్రెస్‌ హయాంలోనే జరిగింది. 1998 నుంచి 2013లో అరవింద్‌ కేజ్రీవాల్‌ పార్టీ ఎన్నికల బరిలోకి దిగేవరకు ఆ పార్టీకి ఎదురే లేకుండా పోయింది. అప్పట్నుంచి జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా కాంగ్రెస్‌ ప్రాభవాన్ని కోల్పోయింది. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తర్వాత స్థానాన్ని కాంగ్రెస్‌ దక్కించుకుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ కొల్లగొట్టిన ఓట్లను తిరిగి రాబట్టడం కోసం కాంగ్రెస్‌ బలమైన అభ్యర్థుల్నే నమ్ముకుంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు