దేశం విచారంలో మునిగిపోయింది!

17 May, 2018 10:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణం చేయడంపై కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తగినంత మెజారిటీ లేకపోయినా.. గవర్నర్‌ సాయంతో యడ్యూరప్ప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారని మండిపడుతోంది. తాజాగా యెడ్డీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడంపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పందించారు. బీజేపీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందని మండిపడ్డారు. బూటకమైన విజయంపై బీజేపీ సంబరాలు చేసుకుంటుండగా.. దేశంలో విచారంలో మునిగిపోయిందని అన్నారు. ‘బీజేపీ తగినంత సంఖ్యాబలం లేకపోయినా.. అసంబద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అంటోంది. ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే. ఈ రోజు ఉదయం తమ బూటకమైన విజయంపై బీజేపీ సంబరాలు చేసుకుంటోంది. కానీ దేశం ప్రజాస్వామ్యం ఓడిపోయినందుకు విచారంలో మునిగిపోయింది’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

యెడ్డీ ప్రమాణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిరసన
ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నేతలు కర్ణాటక విధానసౌధ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, అశోక్‌ గెహ్లాట్‌తోపాటు మాజీ సీఎం సిద్దరామయ్య ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రస్తుతం యడ్యూరప్ప ప్రమాణ స్వీకార అంశం సుప్రీంకోర్టు ఎదుట పెండింగ్‌లో ఉందని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని, ఈ విషయాన్నితాము ప్రజల్లోకి తీసుకెళుతామని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు