మధ్యప్రదేశ్‌లో మళ్లీ బీజేపీనే..!

12 Oct, 2018 02:41 IST|Sakshi

తేల్చిన ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్‌ ఒపీనియన్‌ పోల్‌

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో బీజేపీ రికార్డు సృష్టించనుంది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రానుంది. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటూనే శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మళ్లీ సీఎం కానున్నారు. ఈ నవంబర్‌ 28న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియాటీవీ–సీఎన్‌ఎక్స్‌ నిర్వహించిన ఒక ఒపీనియన్‌పోల్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 230 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీకి ఈసారి 128 సీట్లు వస్తాయని, కాంగ్రెస్‌ కాస్త పుంజుకుని 85 స్థానాల్లో గెలుస్తుందని సర్వే అంచనా వేసింది. అలాగే, బీఎస్పీ 8 సీట్లలో, ఇతరులు 9 సీట్లలో గెలుస్తారని పేర్కొంది.

మాల్వానిమాఢ్‌ ప్రాంతంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని, అక్కడ 45 సీట్లు గెలుచుకున్నా.. 2013 కన్నా అది 16 స్థానాలు తక్కువేనని వెల్లడించింది. కాంగ్రెస్‌ అక్కడ గతంలోకన్నా 14 సీట్లు పెంచుకుని 24 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొంది. మళ్లీ ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగే కావాలని 41% కోరుకోగా, జ్యోతిరాదిత్య సింధియాను 22% మంది, కమల్‌నాథ్‌ను 18% మంది సీఎం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఒక శాతం మాత్రమే సీఎంగా దిగ్విజయ్‌సింగ్‌కు ఓటేయడం గమనార్హం. ముఖ్యమంత్రిగా శివరాజ్‌ పనితీరుకు 30 శాతం చాలా బాగుందని, 11% బావుందని, 16% పర్లేదని, 22% బాగా లేదని తీర్పిచ్చారు. నిరుద్యోగం, రైతు సంక్షోభం, మహిళల భద్రత.. మొదలైనవి ప్రధానంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ ఒపీనియన్‌ పోల్‌లో మొత్తం 10 వేల మంది ఓటర్ల నుంచి అభిప్రాయాలను సేకరించారు. 

మరిన్ని వార్తలు