‘కేబినెట్‌ హోదా ఇష్టారాజ్యం కాదు’

31 Oct, 2017 02:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పలువురు ప్రభుత్వ సలహాదారులు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లకు కేబినెట్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన పలు జీవోలను సవాలు చేస్తూ బీజేపీ సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు.

ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, యువజన సర్వీసులశాఖ ముఖ్య కార్యదర్శిలతోపాటు కేబినెట్‌ హోదా పొందిన బాలకిషన్, ఎ.కె.గోయల్, ఎ.రామలక్ష్మణ్, బి.వి.పాపారావు, కె.వి.రమణాచారి, జి.ఆర్‌.రెడ్డి, పేర్వారం రాములు, కె.ఎం.సహానీ, డాక్టర్‌ వేణుగోపాలచారి, రామచంద్రుడు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పిడమర్తి రవి, అల్లం నారాయణ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ప్రభుత్వం తన ఇష్టారాజ్యంగా కేబినెట్‌ హోదా ఇవ్వడానికి వీల్లేదని ఇంద్రసేనారెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలా కేబినెట్‌ హోదా ఇవ్వడం రాజ్యాంగంలోని అధికరణ 164(1ఎ) విరుద్ధమని తెలిపారు. ఇదే విషయంపై పార్లమెంట్‌ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి పిల్‌ దాఖలు చేశారని, ఆ తరువాత ఆయన అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వెళ్లిన తరువాత ఆ పిల్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరగా, ఇదే హైకోర్టు తిరస్కరించిందన్నారు.    

మరిన్ని వార్తలు