ఏ మలుపు తిరిగేనో..!

4 Apr, 2018 11:21 IST|Sakshi

జేడీ, ఈవోలపై శాఖాపరమైన విచారణకు ఆదేశం

కమిషనర్‌కు లేఖ రాసిన కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

తమకే పాపం తెలియదంటూనే మాట్లాడేందుకు

నిరాకరిస్తున్న పశుసంవర్థక శాఖాధికారులు

నేడు నగరానికి రానున్న మంత్రి

గంటా దృష్టికి తీసుకెళ్లాలని వెంకటప్పడు బృందం సన్నాహాలు

ఏ మలుపు తిరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ

సాక్షి, విశాఖపట్నం:ఆబోతుల కుమ్ములాటలో లేగదూడలు బలైనట్టుంది జిల్లా అధికారుల పరిస్థితి ఉంది. జిల్లా పశుగణాభివృద్ధి సంఘం (డిస్ట్రిక్ట్‌ లైవ్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ)నూతన పాలకవర్గ నియామక విషయంలో మంత్రుల మధ్య తలెత్తిన వివాదం అధికారులకు నిజంగానే ప్రాణసంకటంగా మారింది. తనకు చెప్పకుండా ఎన్నికలు నిర్వహించిన ఈవో సూర్యప్రకాశరావుతో పాటు పశు సంవర్థక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కోటేశ్వరరావులపై  విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం పశుసంవర్థక శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. మరో వైపు ఈ వ్యవహారంలో తమకేపాపం తెలియదంటూ ఆ శాఖాధికారులు వాపోతున్నారు. కావాలనే గంటా ఒత్తిళ్ల మేరకే తన సిఫార్సులను పక్కన పెట్టేశారని భావిస్తున్న అయ్యన్న కలెక్టర్‌ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చివరకు ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కలెక్టర్‌కు తెలిసే అంతా..
ఏప్రిల్‌ 5వ తేదీతో గడువు ముగియనున్న డీఎల్‌డీఏకు కొత్త పాలకవర్గం ఏర్పాటుకు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ జనవరిలోనే స్వయంగా ఆదేశాలు జారీ చేశారని పశుసంవర్థక శాఖ అధికారులంటున్నారు. ‘కలెక్టర్‌ ఆదేశాల మేరకు 17మందిని నామినేట్‌ చేశాం. ఆయన సూచనల మేరకే ఎన్నికలకు ఏర్పాట్లు చేశాం. చివరకు ఎన్నికల నిర్వహణ కోసం 21వ తేదీన సభ్యులకు కలెక్టర్‌ రిఫరెన్స్‌ నోట్‌తోనే నోటీసులు కూడా జారీ చేశాం. 27వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం కూడా కలెక్టర్‌కు తెలుసు’నని ఆ శాఖాధికారులు వాదిస్తున్నారు. ఈ విషయంలో తాము చేసిన తప్పేంటో అర్థం కావడం లేదంటున్నారు.

అయ్యన్న లేఖపై చర్చించనందునే చర్యలు
డీఎల్‌డీఏ కమిటీ ఎన్నికలను నిలుపుదల చేయాలని, పాత పాలక వర్గాన్నే మరోవిడత కొనసాగించాలంటూ జిల్లాకు చెందిన సీనియర్‌ మంత్రి అయ్యన్నపాత్రుడు తనకు రాసిన లేఖపై తనతో చర్చించాలని పశు సంవర్థక శాఖ జేడీ కోటేశ్వరరావుకు పంపానని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చెబుతున్నారు. ఆ లేఖపై తనతో చర్చించాలని స్పష్టంగా రాసినా పట్టించుకోకుండా, తనకు చెప్పకుండా అత్యుత్సాహంతో ఎన్నికలు నిర్వహించేశారన్నది కలెక్టర్‌ వాదన. మంత్రుల మధ్య వైరంలో తమను బలిపశువులను చేయడం ఎంతవరకు సమంజసమని పశుసంవర్థక శాఖాధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ మొ త్తం వ్యవహారంలో తమకే పాపం తెలియదని  పశుసంవర్థక శాఖాధికారులు వాదిస్తుంటే... తనతో చర్చించి ఉంటే పరిస్థి తి ఇంతవరకు వచ్చి ఉండేది కాదని కలెక్టర్‌ అంటున్నారు.

19న లేఖ రాస్తే 23న జేడీకి రిఫర్‌ చేస్తారా?
మరో పక్క పాత పాలకవర్గాన్ని మరో ఏడాది పాటు కొనసాగించాలని డీఎల్‌డీఏ జనరల్‌ బాడీ సమావేశంలో చేసిన తీర్మానాన్ని కోట్‌ చేస్తూ తాను చేసిన సిఫార్సు లేఖను కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ లైట్‌గా తీసుకోవడం పట్ల మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడుతున్నారు. ప్రస్తుత పాలకవర్గాన్ని మరో ఏడాది కొనసాగించాలంటూ తాను గత నెల 19వ తేదీన లేఖ రాశానని, ఆ లేఖపై చర్చించకుండా ఎన్నికలకు 21వ తేదీన నోటీసులు ఎలా జారీ చేస్తారని అయ్యన్నపాత్రుడు ప్రశ్నిస్తున్నారు. పైగా తాను లేఖ ఇచ్చిన ఐదు రోజుల తర్వాత ప్లీజ్‌ డిస్కస్‌ అని జేడీకి పంపడంలో అర్థమేంటని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు నోటీసుల జారీ, జరిగే తేదీ కలెక్టర్‌కు తెలిసే ఉంటుందని తాము భావిస్తున్నామని, మంత్రి గంటా శ్రీనివాసరావు ఒత్తిడి మేరకే మిన్నకుండిపోయి ఉంటారని అయ్యన్న అనుచరులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికల నిర్వహణ కోసం సాక్షాత్తు జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ స్వయంగా ఆదేశాలు జారీ చేసి ఆనక మాట మార్చడంతో అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. కాగా ఈ వ్యవహారంపై స్పందించేందుకు కలెక్టర్‌తో సహా సంబంధిత అధికారులు నోరు మెదిపేందుకు ససేమిరా అంటున్నారు.

నేడు గంటా దృష్టికి డీఎల్‌డీఏ వ్యవహారం
గంటా అనుచరుడైన గాడు వెంకటప్పడు చైర్మన్‌గా 17 మంది సభ్యులతో ఏర్పడిన ఈ కమిటీ మరో రెండు రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్న దశలో ఇలా బ్రేకుపడడం చర్చనీయాంశంమైంది.
తన ఎన్నిక పూర్తిగా నిబంధనల మేరకు బైలా ప్రకారం జరిగిందని, ఎందుకు ఆపాలని చూస్తున్నారో అర్థం కావడం లేదని వెంకటప్పడు వాదిస్తున్నారు. అవసరమైతే న్యాయ పోరాటం చేసేందుకైనా తాము వెనుకాడబోమని కమిటీలో మరికొంతమంది సభ్యులు వాదిస్తున్నారు. బుధవారం జిల్లాకు రానున్న మంత్రి గంటా శ్రీనివాసరావు దృష్టికి జరిగిన విషయాన్ని తీసుకెళ్లేందుకు వెంకటప్పడు బృందం సన్నాహాలు చేస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

మరిన్ని వార్తలు