రాజీవ్‌ ఆదేశాలతోనే సిక్కుల ఊచకోత

10 May, 2019 04:42 IST|Sakshi

బీజేపీ సంచలన ఆరోపణ

ఖండించిన కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: 1984లో సిక్కులను ఊచకోత కోయాలని రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నపుడు ప్రధాని కార్యాలయం(పీఎంవో) నుంచి ఆదేశాలు వచ్చాయని బీజేపీ గురువారం సంచలన ఆరోపణ చేసింది. ఈ విషయం నానావతి కమిషన్‌ దృష్టికి వచ్చిందని తెలిపింది. అయితే నానావతి కమిషన్‌ రిపోర్టు మాత్రం బీజేపీ ఆరోపణలకు భిన్నంగా ఉండటం గమనార్హం. ప్రధాని ఇందిరాగాంధీని 1984 అక్టోబర్‌ 31న ఆమె అంగరక్షకులైన ఇద్దరు సిక్కులు కాల్చిచంపడంతో ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి.  దాదాపు 3,000 మంది అమాయక సిక్కులు ప్రాణాలు కోల్పోయారు.  

‘నానావతి’ రిపోర్టులో ఏముంది?
సిక్కుల ఊచకోతపై 2000లో ఎన్డీయే ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ జీటీ నానావతి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. 2005లో సమర్పించిన ఈ నివేదికలో నానావతి కమిషన్‌ స్పందిస్తూ.. ‘సిక్కులకు గుణపాఠం చెప్పాలని రాజీవ్‌ అన్నట్లు వచ్చిన ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యం లేదు. ఢిల్లీలో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు రాజీవ్‌ కృషి చేశారు. ఇందిర హత్య అనంతరం ప్రజలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు’ అని తెలిపింది.

దమ్ముంటే ప్రజాసమస్యలపై పోరాడండి: కాంగ్రెస్‌
బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా మండిపడింది. ప్రస్తుతం 2019 ఎన్నికలు జరుగుతున్నాయే తప్ప 1951, 1966, 1984 లోక్‌సభ ఎన్నికలు జరగడం లేదు. దమ్ముంటే నిజమైన ప్రజా సమస్యలపై పోరాడండి. మోదీ పెద్ద అబద్దాలకోరుగా మారిపోయారు’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. సిక్కు వ్యతిరేక అల్లర్లలో దోషిగా తేలిన కాంగ్రెస్‌ నేత సజ్జన్‌కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు గతేడాది డిసెంబర్‌లో యావజ్జీవ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు