ఎమ్మెల్యేలకు ‘సన్‌’ స్ట్రోక్‌!

15 Apr, 2018 02:24 IST|Sakshi

అధికార దుర్వినియోగంపై ఇంటెలిజెన్స్‌ నివేదిక

రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల కుమారులపై నివేదిక సిద్ధం

అన్ని దందాల్లో అధికార పలుకుబడితో హల్‌చల్‌

గ్రాఫ్‌ పడిపోవడానికి వారే ప్రధాన కారణమని అంచనా

సాక్షి, హైదరాబాద్‌: తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని నియోజకవర్గాల్లో అధికారం చెలాయిస్తున్న ఎమ్మెల్యేల కుమారుల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. చేతిలో అధికారం, అడ్డుచెప్పే వారు లేకపోవడంతో అధికార పార్టీలోని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల కుమారులు రెచ్చిపోతున్నారు.

నియోజకవర్గంలోని అన్ని దందాల్లో జోక్యం చేసుకుంటూ తండ్రులు సీటు కోల్పోయే పరిస్థితులు తీసుకొచ్చినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాల నివేదికలో బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల కుమారుల దం దాలు, ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా వ్యవ హరిస్తున్న వారిపై ఇంటెలిజెన్స్‌ విభాగం నివేదిక రూపొందించినట్లు చర్చ జరుగుతోంది.

బదిలీల నుంచి భారీ సెటిల్‌మెంట్ల దాకా..
మంత్రి వర్గంలోని అమాత్యుల కుమారులు పైరవీలు, సెటిల్‌మెంట్లే బిజినెస్‌గా మార్చు కొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కేబినెట్‌ హోదాలో ఉన్న సీనియర్‌ ఎమ్మెల్యేల సుపుత్రులూ అదే దారిలో నడుస్తున్నట్లు తేలింది. ఉత్తర తెలంగాణలోని కొందరు మంత్రుల కుమారులు, ఓ కేబినెట్‌ హోదాలో ఉన్న సీనియర్‌ ఎమ్మెల్యేతో పాటు అత్యున్నత పదవిలో ఉన్న మరో ఎమ్మెల్యే కుమారులు ప్రతి పనికి రేటు ఫిక్స్‌ చేసి దందా చేస్తున్నారు.

ఇసుక దందాలో ప్రతినెలా తమకు రావాల్సిన వాటాలు ఫిక్స్‌ చేసి దండుకున్నట్లు ప్రగతి భవన్‌కు వెళ్లిన రిపోర్టులో ఇంటెలిజెన్స్‌ స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. దక్షిణ తెలంగాణలోని కీలక ప్రాంతం నుంచి మంత్రి వర్గంలో ఉన్న మరో ఇద్దరు సీనియర్‌ నేతల కుమారులు ఏకంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ట్లు బహిరంగంగానే ప్రకటించుకుంటున్నారు.

వాళ్లదే ఫైనల్‌..
కరీంనగర్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే కుమారుడు ఉద్యోగం వదిలేసి తండ్రి అధికార వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నాడు. పోలీస్, రెవెన్యూ పోస్టింగులు తదితరాల్లో తండ్రికి సంబంధం లేకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇటీవల జరిగిన ఎస్సై, ఇన్‌స్పెక్టర్‌ పోస్టింగుల్లో రూ.60 లక్షలు వసూలు చేసినట్లు ఇంటెలిజెన్స్‌ రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం.

ఆదిలాబాద్‌కు చెందిన మరో సీనియర్‌ ఎమ్మెల్యే కుమారుడు స్మగ్లింగ్‌ వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కోవడం సంచలనంగా మారింది. తనకు తెలియకుండా అనుమతులు, బిల్లులు జారీ చేయొద్దని అధికారులను బెదిరించే స్థాయికి వెళ్లిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాంట్రాక్టర్లు కూడా సదరు ఎమ్మెల్యే కుమారుడితో డీల్‌ కుదిరాకే పనులు ప్రారంభిస్తున్నారని సమాచారం.  

తండ్రి స్థానంలో సమీక్షలు!
వరంగల్‌కు చెందిన ఇద్దరు సీనియర్‌ ఎమ్మెల్యేలు, అత్యున్నత పదవుల్లో ఉన్న వీరి పుత్రర త్నాల వ్యవహారాలు గతంలో సీఎంకే ఆగ్రహం తెప్పించాయి. హెచ్చరికలతో కొన్నాళ్ల పాటు స్తబ్దుగా ఉండి ఇప్పుడు మళ్లీ దందాలు ప్రారంభించారు.

తండ్రి మంత్రి అయినా సమీక్షలు మొత్తం కొడుకులు చేసే పరిస్థితుల్లో ఓ సీనియర్‌ మంత్రి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇతర జిల్లాల్లోని నియోజకవర్గాల వ్యవహారాల్లోనూ మంత్రి కుమారుడు కలుగజేసుకోవడం గతంలో సీఎం ఆఫీస్‌ వరకు వెళ్లింది. దీంతో ఎమ్మెల్యేలకు ఆ మంత్రి నచ్చజెప్పుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

గాడితప్పినా పట్టింపు లేదు..
తమ పుత్రరత్నాలు చేస్తున్న వ్యవహారాలు పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందని తెలిసినా మంత్రులు, సీనియర్‌ ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా వ్యవహరించడం పార్టీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఇటీవల నిర్వహించిన మూడు సర్వేల్లో ఎమ్మెల్యేల పుత్రరత్నాల వ్యవహారం వల్లే ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ గ్రాఫ్‌ పడిపోయినట్లు ఇంటెలిజెన్స్‌ సర్వేలో బయటపడిందని సమాచారం.

మొత్తంగా 14 నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల కుమారుల ఆగడాల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులు ఏర్పడినట్లు అంచనా. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే వరంగల్‌లో ఇద్దరు నేతల కుమారులు, ఆదిలాబాద్‌లో నలుగురు, నిజామాబాద్‌లో ఇద్దరు, మహబూబ్‌నగర్‌లో ఒకరు, హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో నలుగురు, కరీంనగర్‌లో ఒక ఎమ్మెల్యే కుమారుడు ఇంటెలిజెన్స్‌ జాబితాలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

మరిన్ని వార్తలు