గులాబీ తోటలో అలజడి!  

16 Mar, 2020 09:41 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: డీసీసీబీలో ఉన్నత పదవి ఆశించి భంగపడ్డ లింగంపేట సింగిల్‌విండో చైర్మన్‌ సంపత్‌గౌడ్‌ తన పదవికి రాజీనామా చేయడం అధికార పార్టీలో అలజడి రేపింది. ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని లింగంపేట సహకార సంఘం చైర్మన్‌గా ఎన్నికైన సంపత్‌గౌడ్‌ డీసీసీబీ లేదంటే డీసీఎంఎస్‌ చైర్మన్‌ అవకాశం కోసం ప్రయత్నించారు. అందరితో కలిసి క్యాంపునకు వెళ్లినా.. తన ప్రయత్నాలు తను చేశారు. నామినేషన్ల సమయం వరకు అవకాశం వస్తుందని ఆశగా ఎదురుచూశారు. చివరకు ఆయనకు ఏ అవకాశం దొరకదని తేలిపోవడంతో నిరాశతో ఇంటికి చేరారు. చివరకు విండో చైర్మన్‌ పదవిని వదులుకోవాలని నిర్ణయించుకుని ఆదివారం తన రాజీనామా లేఖను జిల్లా సహకార అధికారికి అందజేశారు.  

చర్చనీయాంశమైన రాజీనామా వ్యవహారం 
లింగంపేట: టీఆర్‌ఎస్‌లో క్రియాశీలకంగా పనిచేస్తున్న సంపత్‌గౌడ్‌ లింగంపేట వ్యవసాయ సహకార సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఏడేళ్ల క్రితం జరిగిన సొసైటీ ఎన్నికలలో కాంగ్రెస్‌ మద్దతుతో డైరెక్టర్‌గా గెలిచిన ఆయన సింగిల్‌ విండో చైర్మన్‌ అయ్యారు. 2014లో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రాగానే అధికార పారీ్టలో చేరిపోయారు. అప్పటి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. దీంతో ఆయనను డీసీసీబీ డైరెక్టర్‌ పదవి వరించింది. అలాగే జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గానూ అవకాశం కల్పించారు. ఓ సమయంలో డీసీసీబీ చైర్మన్‌ పదవిని ఆశించి క్యాంపు రాజకీయాలూ నడిపారు. అయితే పట్వారి గంగాధర్‌ కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆయనకు అవకాశం రాలేదు.  

సముచిత స్థానం దక్కక.. 
అసెంబ్లీ ఎన్నికల్లో రవీందర్‌రెడ్డి ఓడిపోవడం, కాంగ్రెస్‌నుంచి గెలిచిన సురేందర్‌ టీఆర్‌ఎస్‌లో చేరడంతో సంపత్‌ కూడా సురేందర్‌ వర్గంలో చేరిపోయారు. ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉంటున్నారు. సంపత్‌ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. ఇటీవల నిర్వహించిన సింగిల్‌ విండో ఎన్నికలలో గెలిచి రెండోసారి లింగంపేట సొసైటీ చైర్మన్‌ అయ్యారు. జిల్లా రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆయన డీసీసీబీ లేదా డీసీఎంఎస్‌లలో ఉన్నత పదవి ఆశించారు. అయితే ఆయనకు ఎమ్మెల్యేనుంచి మద్దతు లభించలేదు. దీంతో డైరెక్టర్‌గానూ అవకాశం రాలేదు. ఎన్నికలకు ముందు ముఖ్య నేతలు హామీ ఇచ్చి, ఆ తర్వాత అన్యాయం చేశారని ఆవేదనకు గురైన సంపత్‌గౌడ్‌.. సొసైటీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది.  

ఎన్నికపైనా వివాదం.. 
సంపత్‌గౌడ్‌ విండో చైర్మన్‌ ఎన్నిక కూడా వివాదాస్పదమైంది. మెజారిటీ డైరెక్టర్ల మద్దతు లేకున్నా చైర్మన్‌ అయ్యారంటూ కొందరు డైరెక్టర్లు కోర్టును ఆశ్రయించారు. రాజీనామాకు ఇదీ ఒక కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు