ఏ నిమిషానికి ఏమౌనో

20 May, 2018 07:01 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: బలనిరూపణ సందర్భంగా శనివారం విధానసౌధలోని అధికార, ప్రతిపక్షాల శిబిరాల్లో ఎటు చూసినా చర్చోపచర్చలే దర్శనమిచ్చాయి. ఎమ్మెల్యేలు గుంపులు గుంపులుగా చేరి చెవులు కొరుక్కోవడంలో బిజీ అయ్యారు.  15వ విధానసభ సమావేశాల్లో మొదటిరోజు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయా పార్టీల ఎమ్మేల్యేలు తమ శిబిరాల్లో బలనిరూపణపై ఆసక్తిగా చర్చించుకున్నారు. తమ ఎమ్మెల్యేలందరూ సభకు హాజరు కావడంతో కాంగ్రెస్‌–జేడీఎస్‌ శిబిరంలో ఉత్సాహం నెలకొంది, పథకాలు పారలేదని బీజేపీ ఎమ్మెల్యేల మోములు వాడిపోయాయి. పరీక్షలో తమదే విజయమంటూ బీజేపీ నేతలు శనివారం ఉదయం కూడా ధీమా వ్యక్తం చేయడంతో అటు కాంగ్రెస్‌–జేడీఎస్‌ శిబిరంలో కొంత ఆందోళన మొదలైంది. అద్భుతమేమీ జరగదని తెలిసి బీజేపీ శిబిరంలో నైరాశ్యత నెలకొంది. 

ఒకవేళ కాంగ్రెస్‌–జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం వచ్చినా ఎన్ని రోజులు ఉంటుందోనంటూ నేతలు చర్చించుకున్న సన్నివేశాలు కూడా దర్శనమిచ్చాయి. ఓటింగ్‌ జరిగే సమయానికి బీజేపీ తమ ఎమ్మెల్యేలను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందనే భయంతో కాంగ్రెస్‌ నేతలు భోజనాలు కూడా చేయకుండా తమ ఎమ్మేల్యేలను రక్షించుకునే పనిలో పడ్డారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప, కేంద్రమంత్రులు అనంత్‌కుమార్, సదానందగౌడ, బీజేపీ నేత మురళీధరరావులు విధానసౌధలోని తమ శిబిరంలోను భుజించగా జేడీఎస్‌ ఎమ్మేల్యేలు తాము బసచేసిన హోటళ్లకు వెళ్లారు. 

మరిన్ని వార్తలు