హరియాణాలో రాజకీయ వేడి

13 Oct, 2019 04:53 IST|Sakshi

హరియాణాలో రాజకీయ వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌ అగ్రనాయకులంతా హరియాణాలో మకాం వేస్తున్నారు. దీంతో హోరాహోరీ నెలకొంది. రాష్ట్రంలో 2009 వరకు కాంగ్రెస్‌ హవా కొనసాగినా 2014 తొలిసారి బీజేపీ పాగా వేసింది. గత మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పదికి పది స్థానాల్లోనూ విజయఢంకా మోగించిన కమలం ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం తమదేనని ధీమాతో ఉంది. మరోవైపు కాంగ్రెస్‌లో అంతర్గ కుమ్ములాటలు కూడా బీజేపీకి మరింత బలాన్నిస్తున్నాయి. అయితే కుమారి సెల్జా నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్‌ కూడా ఎలాగైనా పగ్గాలు చేజిక్కించుకోవాలని కసరత్తు చేస్తోంది. ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్‌ల మధ్యే ఉండనుంది.  

‘కశ్మీర్‌’ పనిచేస్తుందా?
బీజేపీకి తీవ్రమైన వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే బీజేపీ ప్రజాప్రదర్శనలాంటి పలు కార్యక్రమాలు చేపట్టింది. అస్సాంలో మాదిరిగా  హరియాణాలో అక్రమ వలసల నివారణకు ప్రభుత్వం యత్నిస్తోంది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో బీజేపీ ఎదుర్కోనున్న ప్రధాన సవాల్‌ నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ (ఎన్నార్సీ) నుంచే. అయితే మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలైన కశ్మీర్‌ స్వయంప్రతిపత్తి రద్దు, ముస్లిం మైనారిటీ మహిళల హక్కులను కాపాడే త్రిపుల్‌ తలాక్‌ రద్దు చట్టం ఈ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలన్నది నిపుణుల అంచనా.

హరియాణాలో 18 ఏళ్ళ తరువాత జాట్‌యేతరుడైన ఖట్టర్‌ సీఎం అయ్యారు. అయినా జాట్‌ల ఉద్యమాన్ని సరిగ్గా డీల్‌ చేయలేకపోయారన్న విమర్శలున్నాయి. అయితే ఈసారి ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ శాయశక్తులా కృషి చేస్తోంది. ఎన్నికలు అత్యంత సమీపంలో ఉన్న వేళ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు అలుముకున్నాయి. మోదీతో సహా బీజేపీ అగ్రనేతలంతా ప్రచారానికి దిగుతున్నారు. దీంతో అంతర్గత కుమ్ములాటలు చల్లారే అవకాశం ఉంది.

భూపేందర్‌ స్థానమెక్కడ?
హరియాణాలో 27 శాతం జాట్‌ సామాజికవర్గాలే ఉన్నాయి. గతంలో ఐదుగురు ముఖ్యమంత్రులు ఇదే సామాజికవర్గం నుంచి ఉన్నారు.  స్వయంగా భూపేందర్‌ సింగ్‌ హుడా, అతని కుమారుడు దీపేందర్‌ సింగ్‌ హుడా సోనాపేట్, రోహతక్‌ల నుంచి 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. జాట్‌ సామాజిక వర్గం ఆధిపత్యంలోని ఈ ప్రాంతం ఒకప్పుడు భూపేందర్‌కి బలమైన ప్రాంతం. ఈసారి సైతం కష్టతరమేనని నిపుణులు అభిప్రాయం.

కాంగ్రెస్‌లో లుకలుకలు
రాష్ట్రంలో పునర్‌వైభవాన్ని తీసుకొచ్చే మాట అటుంచి, అసలు పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు అంతేలేదు. స్వయంగా రాహుల్‌ గాంధీయే ఏరికోరి పీసీసీ అధ్యక్షుడిని చేసిన దళిత నేత అశోక్‌ తన్వర్‌ని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి భూపేందర్‌ సింగ్‌ పై ఈ వర్గాలు తాడోపేడో అన్నట్టున్నాయి. అంతేకాదు. ఏకంగా ఢిల్లీలో సోనియా నివాసం ముందు ధర్నాకి కూడా దిగారు. దీంతో విసిగిపోయిన శ్రేణులు బీజేపీలో చేరిపోయారు. రేపటి నుంచి రాహుల్‌ ప్రచారం ప్రారంభమౌతున్నా కాంగ్రెస్‌ని నిరాశాభావం వెంటాడుతోంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా