మోదీ-షా ఇద్దరిలో ఎవరు నిజం : బాఘేలా

17 Jan, 2020 19:39 IST|Sakshi

మోదీ- అమిత్‌ షాలపై ఛత్తీస్‌గఢ్‌ సీఎం సంచలన వ్యాఖ్యలు

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షాపై ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బాఘేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ-షా మధ్య విభేదాలు ఉన్నాయని, వీరిద్దరి మధ్య అంతర్గత సంఘర్షణతో దేశ ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై ఇద్దరూ విరుద్ధ ప్రకటన చేస్తూ.. ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం రాయ్‌పూర్‌లో జరిగిన ఓ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో మోదీ నోట్ల రద్దు, జీఎస్‌టీ లాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే, రెండోసారి అధికారంలోకి వచ్చాక  అమిత్‌ షా నేతృత్వంలో ఆర్టికల్‌ 370 రద్దు, ఎన్‌ఆర్‌సీ, సీఏఏ వంటి వివాదాస్పద చట్టాలు తీసుకువచ్చారని విమర్శించారు.

వీటన్నింటిపై మోదీ-షా మధ్య అవగాహన లోపం ఎంతో ఉందని భాఘేలా అభిప్రాయపడ్డారు. పలు సందర్భాల్లో ఎన్‌ఆర్‌సీని అమలు చేసే ప్రసక్తేలేదని మోదీ ప్రకటిస్తే.. అమలు చేసి తీరుతామని అమిత్‌ షా స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వీరిద్దరిలో ఎవరు నిజమని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత.. అమిత్‌ షానే అంతా తానై వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతో దేశ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన విమర్శించారు.

ప్రధానంగా ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగ సమస్య దేశ ప్రజలను తీవ్రంగా వెంటాడుతోందని సీఎం అన్నారు. అయినా.. వీటిపై  ఎవరూ కనీసం చర్చ కూడా జరపడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద చట్టాలను తెరపైకి తీసుకువస్తోందని మండిపడ్డారు. కాగా సీఎం వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని వార్తలు