సీపీఎం మహాసభల్లో రసాభాస

19 Apr, 2018 13:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ మార్క్సిస్ట్‌(సీపీఎం) జాతీయ మహాసభల(22వ) రెండో రోజు రసాభాసగా మారింది. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు అంశం ముఖ్యనేతల మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేర్చింది. ఒకానోక దశలో సభల్లో రెండు రకాల రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టడంతో.. వర్గ పోరు తారాస్థాయికి చేరినట్లు సమాచారం. (చారిత్రక తప్పిదమా?)

ఒంటరిగా పోరాటం చేస్తూనే ప్రగతిశీల శక్తులను ఐక్యం చేసి బీజేపీని దెబ్బ కొట్టాలని సీనియర్‌ నేత ప్రకాశ్‌ కారత్‌ తన వాదన తెరపైకి తెస్తే.. బలోపేతమైన బీజేపీని దెబ్బ కొట్టాలంటే కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ముందుకెళ్లాల్సిందేనని ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వాదిస్తున్నారు. గతంలో కేంద్ర కమిటీలో ఏచూరి తీర్మానం వీగిపోగా.. అన్యమనస్కంగానే ఆయన ఇప్పుడు మహాసభల్లో పాల్గొంటున్నారు. ఈ తరుణంలో నేడు జరగబోయే కీలక భేటీలో తన నిర్ణయాన్ని కుండబద్ధలు కొట్టాలని ఆయన భావిస్తున్నారు. 

మరోవైపు పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ ప్రతిపాదనకే మెజారిటీ సభ్యులు మద్దతు తెలుపుతున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మహాసభల్లో రెండు రకాల రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టడం పార్టీ చరిత్రలో లేదని.. ఇది పార్టీ ప్రతిష్టకు మంచిది కాదని కొందరు సీనియర్‌ నేతలు వారిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఓటింగ్‌ అనివార్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకోపక్క జాతీయ కార్యదర్శిగా మళ్లీ సీతారామే ఎన్నికవుతారన్న చర్చ మొదలవుతుండగా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన కొనసాగింపు కష్టమేనన్న మరో వాదన తెరపైకి వచ్చింది. కేరళ, మణిపూర్‌ తదితర ప్రాంతాల్లో పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిందేనని.. లేకపోతే పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంటుందని సీతారాం ఏచూరి వాదిస్తున్నారు. ఏదిఏమైనా నేటి కీలక భేటీలో తీసుకోబోయే నిర్ణయం ఏంటన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది.

రాజీనామాకు సిద్ధపడ్డ ఏచూరి!

>
మరిన్ని వార్తలు