జనం నాడి తెలిసింది

29 Mar, 2019 07:24 IST|Sakshi

మనసులో మాట

సాక్షి, అమరావతి :  ప్రభుత్వ బడిలో చదువుకుని డాక్టర్‌గా ఎదిగి పలు అవార్డులు పొందారు. అమ్మతనం లేక ఇబ్బందిపడుతున్న ఎందరికో మాతృత్వ వరం ప్రసాదించారు. పుట్టిన నేలకు,ప్రజలకు సేవా చేయాలని రాజకీయాల్లోకి ప్రవేశించారు. నియోజకవర్గంలో వైద్య శిబిరాలు, రాజన్న క్యాంటీన్‌ లాంటి కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా తిరిగి సమస్యలను తెలుసుకున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను స్ఫూర్తిగా తీసుకున్న తాడికొండ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి అంతరంగం ఆమె మాటల్లోనే..

‘మాది గుంటూరు జిల్లా తాడికొండ. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. అమ్మ వరలక్ష్మి ఉపాధ్యాయురాలు. నాన్న ఉండవల్లి సుబ్బారావు 1978లో తాడికొండ  నుంచి రెడ్డి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వైద్యురాలిగా రోగులకు సేవలందించా. రాజకీయాల్లోకి వస్తే అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరించవచ్చని భావించా. తాడికొండలో స్థానికేతరులే ఇప్పటివరకు పోటీ చేశారు. వైఎస్సార్‌సీపీలో మహిళలకు సముచిత స్థానం కల్పించారు. 40 ఏళ్ల తరువాత లోకల్‌ అభ్యర్థి, మహిళ, విద్యావంతురాలికి ఇక్కడ పోటీచేసే అవకాశాన్ని జగనన్న కల్పించి స్త్రీల పట్ల తనకున్న గౌరవాన్ని చాటారు.   

2వేల మందికి పైగా మాతృత్వం ప్రసాదించా.. 
సంతాన లేమితో బాధపడుతున్న స్త్రీలకు పలు ప్రముఖ మీడియా చానల్స్‌లో ఇంటర్వ్యూల ద్వారా కూడా చైతన్యం కలిగించా. రెండువేల మందికి పైగా స్త్రీలకు అమ్మతనం కలిగించాననే తృప్తి ఉంది. నేను డీజీఓ ఫెలో ఇన్‌ ఏఆర్టీ క్లావండ్‌ క్లినిక్‌ ఓయోహో ఇన్‌ అమెరికాలో విద్యనభ్యసించాను. వైద్యరత్న, వైద్య శిరోమణి, అంబేడ్కర్‌ ఎక్సెలెన్స్‌తో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నా.  

ఆప్యాయంగా పలుకరిస్తూ.. ఆశీర్వదిస్తున్నారు 
కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నన్ను స్థానిక మహిళను కావడంతో తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఆప్యాయంగా పలుకరిస్తూ బొట్టు పెట్టి ఆశీర్వదిస్తున్నారు. మా ఇంటి పెద్ద కూతురు వచ్చిందన్న ఆనందంతో ప్రజలు ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు మేమంతా నీవెంట నడుస్తామని ముందుకు కదులుతున్నారు.  

రాజధాని ప్రాంతంలో అన్ని దందాలే.. 
రాజధాని ప్రాంతంలో రైతులకు, రైతు కూలీలకు ఉపాధి లేకుండా పోయింది. టీడీపీ ప్రభుత్వం రైతుల నుంచి భూమిని తీసుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోంది. ఇసుక మాఫియా, భూదందాలు, ఎస్సీ, ఎస్టీ భూములను ఆక్రమించుకోవడం, అసైన్డ్‌ భూములకు సరైన ప్యాకేజీ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. భూమిలేని రైతు కూలీలకు భూసేకరణ చట్టం ప్రకారం రూ.9,400 ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.2,500 మాత్రమే ఇస్తున్నారు.

సొంతిళ్లు నిర్మిస్తామని మోసం చేశారు. రైతులకు ప్లాట్లు కేటాయించామని చెబుతున్నా  కాగితాల మీద తప్ప ఫీల్డ్‌లో కనిపించడం లేదు. కంపచెట్లు తప్ప ఒక్క శాశ్వత భవనం కట్టలేదు. గ్రాఫిక్‌ డిజైన్లతో బాబు ప్రాంత ప్రజలను మోసగిస్తున్నారు.  

రాజకీయాలే సరైన వేదిక.. 
పుట్టిన గడ్డకు సేవ చేసి రుణం తీర్చుకోవాలనే కృతనిశ్చయంతోనే రాజకీయాల్లోకి వచ్చా. దివంగత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి నాకు ఆదర్శం. రూపాయి డాక్టర్‌గా, మేనిఫెస్టోలో లేకపోయినా ఆరోగ్యశ్రీ  పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతోమంది పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందించిన మహానుభావుడు. జగనన్న పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా తిరిగి సమస్యలను తెలసుకున్నారు.

ఆయన సీఎం అయితేనే పేద ప్రజలతో పాటు అన్ని వర్గాలకు మంచి జరుగుతుందని విశ్వసిస్తున్నా. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే లక్షణాన్ని ఆయనలో గమనించా. ప్రజల కష్టాలను తెలుసుకుంటూ నిరంతరం వారికి అందుబాటులో ఉండాలన్న ఆయన సూచనను పాటిస్తా.  

మెరుగైనవైద్యం..
తాడికొండ పరిధిలోని నాలుగు మండలాల్లో ఏరియా ఆసుపత్రులు ఏర్పాటు చేస్తా. నియోజకవర్గంలో ఆరోగ్యశ్రీతో అనుసంధానించి కార్పొరేట్‌ ఆసుపత్రిని నిర్మిస్తా. విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తా. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో హైస్కూళ్లు లేని పరిస్థితి. మహిళల రక్షణపై దృష్టి పెట్టి సమాజంలో గౌరవం పెరిగేలా కృషి చేస్తా. ప్రతి గ్రామానికి కృష్ణా జలాలు తీసుకురావడంతోపాటు మినరల్‌ వాటర్‌ అందిస్తా. గ్రామాల్లో శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తా. రోడ్లు, బస్సు, కమ్యూనిటీ హాలు అందుబాటులోకి వచ్చేలా తెస్తా. 20 ఏళ్లు ప్రజల నాడి పట్టుకుని డాక్టర్‌గా వైద్య సేవ చేశా. వారంతా వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రావాలని గట్టిగా కోరుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు