ఎన్నికల విధుల్లోకి ఐపీఎస్‌లు 

4 Dec, 2018 01:38 IST|Sakshi

పలుచోట్ల ఇన్‌చార్జిలుగా బాధ్యతలు

లక్ష మందితో ఎన్నికలకు బందోబస్తు: ఏడీజీ జితేందర్‌

ఈసీ ఆదేశాల మేరకే రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపించేందుకు పోలీస్‌ శాఖ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో ఉన్న పలువురు ఐపీఎస్‌ అధికారులకు పలుచోట్ల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 6 నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు నిర్ణీత ప్రాంతాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశిస్తూ పోలీస్‌ శాఖలో అంతర్గత సర్క్యులర్‌ జారీ చేశారు. అదనపు డీజీలతోపాటు ఐజీలు, డీఐజీలను ఈ ఇన్‌చార్జి బాధ్యతల్లో నియమిస్తున్నట్టు తెలిపింది. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ బి.మల్లారెడ్డిని హైదరాబాద్‌కు, రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాస్‌రావును వికారాబాద్‌కు, ఐజీ స్వాతి లక్రాను సిద్దిపేటకు, డీఐజీ షానావాజ్‌ ఖాసీంను సూర్యాపేట్‌కు ఇన్‌చార్జిగా నియమించినట్టు తెలిసింది. అలాగే మిగతా అదనపు డీజీలు, ఐజీ, డీఐజీలు మొత్తం 18 మందిని ఇతర ప్రాంతాల్లో నియమించనున్నట్లు తెలిసింది.  

లక్ష మందితో భద్రత.. 
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని లక్షమందితో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు అదనపు డీజీపీ జితేందర్‌ సోమవారం తెలిపారు. తెలంగాణ పోలీస్‌ సిబ్బంది 50 వేల మంది, సెంట్రల్‌ ఫోర్స్‌ 25 వేల మంది, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి 25 వేల మందిని రంగంలోకి దింపుతున్నట్టు తెలిపారు.  

రేవంత్‌రెడ్డిపై కేసు.. 
ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు కొడంగల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిపై 341, 188, 506, 511 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. కొడంగల్‌ రిటర్నింగ్‌ అధికారి రేవంత్‌ రెడ్డికి నోటీసులు జారీచేశారని, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సభ ముట్టడిపై వివరణ ఇవ్వాలని నోటీసులు అందించారని తెలిపారు. బొంరాశ్‌పేట్‌ పరిధిలో రెండు రోజులపాటు 144 సెక్షన్‌ విధిస్తున్నామన్నారు.  

మరిన్ని వార్తలు