రథయాత్ర ప్రారంభోత్సవాలకు ఎంపీ నుస్రత్‌ జహాన్‌

2 Jul, 2019 16:21 IST|Sakshi

కోల్‌కతా : ఇటీవల వరుస వివాదాలతో సంచలనంగా మారిన నటి, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ నుస్రత్‌ జహాన్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. కోల్‌కతాలోని ప్రముఖ ఇస్కాన్‌ దేవాలయంలో గురువారం వైభవంగా జరిగే రథయాత్ర ప్రారంభోత్సవాలకు ఆమె హాజరుకానున్నారు. దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు భర్తతో సహా అక్కడికి వెళ్లనున్నారు. కాగా తమ అభ్యర్థనను మన్నించినందుకు ఇస్కాస్‌ దేవాలయ అధికార ప్రతినిధి రాధరామన్ దాస్.. నుస్రత్‌ జహాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం ఇటువంటి ఉత్సవాలకు హాజరవుతూ.. సమ్మిళిత భారతం వైపు అడుగులు వేయటం గొప్ప పరిణామమని ప్రశంసించారు. నుస్రత్‌ వ్యవహరించే తీరు మెరుగైన సమాజం వైపు దారి చూపుతోందన్నారు.

కాగా ముస్లిం మతస్తురాలైన నుస్రత్‌ జహాన్‌ ఇటీవలే ఓ వ్యాపారవేత్తను పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. వివాహానంతరం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె.. నుదుట సింధూరం, చీర ధరించి హిందూ సంప్రదాయ పద్ధతిలో పార్లమెంట్‌కు హాజరయ్యారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో  పెద్ద ఎత్తున ఆమెపై ట్రోలింగ్‌ జరిగింది. వాటికి అంతే దీటుగా ఆమె కూడా ట్విటర్‌ ద్వారా కౌంటర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాను సమ్మిళిత భారత్‌ను సూచించేలా సింధూరాన్ని ధరించానని జవాబిచ్చారు. సింధూరం కుల, మత, వివక్షలకు అతీతమైనదని అన్నారు. హింసను, పగను రెచ్చగొట్టే ఉన్మాదుల కామెంట్లను తాను పట్టించుకోన్నారు. తాను ముస్లింగానే ఉంటానని, కానీ అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టంచేశారు. తానేం ధరించాలో తన ఇష్టమని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో ఇస్కాన్‌ రథయాత్ర ప్రారంభోత్సవాలకు నుస్రత్‌ హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

>
మరిన్ని వార్తలు